కొందరు ప్రభుత్వాధికారులకు వారు చేసిన మంచి పనులతో సోషల్ మీడియాలో, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పెరుగుతుంటాయి. మరికొందరికైతే అలాంటివి ఏమీ చేయకుండానే కేవలం వారి మాట, ప్రవర్తనతోనే బాగా ప్రాచుర్యంలోకి వస్తుంటారు. ఇప్పుడు అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ మహిళా వాలంటీర్‌పై విరుచుకుపడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
విషయం ఏంటంటే నరసరావుపేట మూడో వార్డు వాలంటీర్ షేక్ అక్తర్ డ్యూటీ మధ్యలో ఇంటికి వెళ్లింది. నీకు ఎవరు అనుమతిచ్చారంటూ కమిషనర్ కోపంతో ఊగిపోయారు. ఒకవైపు ఆమె పిల్లలకు అన్నం పెట్టేందుకు వెళ్లాలని చెప్తున్నా వినిపించుకోలేదు. తీసిపడేస్తున్నా.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి పోండన్నారు. చెప్పిన పని చెయ్యారా? లోపల పడేసి ఐదు నిమిషాలు ఉతికిస్తా అంటూ బెదిరింపులకు దిగారు.
నేను ఏం చేశానని తిడుతున్నారంటూ మహిళా వాలంటీర్ అక్తర్ ప్రశ్నించగా కమిషనర్ ఆగ్రహానికి గురయ్యారు. పిల్లల్ని చూసుకోవాలంటే ఇంట్లోనే ఉండండి అంటూ సూచించారు. నా పనిలో పెండింగ్ ఏం ఉంది సక్రమంగానే చేస్తున్నాగా అంటూ అక్తర్ ప్రశ్నించింది. కమిషనర్ కాల్ చేసి కూడా బూతులు తిట్టారంటూ అక్తర్ ఆరోపించింది.