పగలు పేపర్లు ఏరుకునే వాడిలా నటిస్తూ రాత్రి వేళల్లో హత్యలు చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అంకమ్మరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతడే ఆ మూడు హత్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
నరసారావు పేటలో జంట హత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున నరసారావు పేటలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ వ్యక్తి.. కాసు బ్రహ్మానందరెడ్డి పురపాలక సంఘ దుకాణ సముదాయంలో మరో వ్యక్తి హత్యకు గురై పడి ఉన్నారు. వీరిలో ఓ మృతుడ్ని తెలంగాణకు చెందిన సంపత్‌రెడ్డిగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న నరసారావు పేటలోని మెయిన్ రోడ్డు పాత ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఓ మహిళ హత్యకు గురైంది. యాచకురాలైన ఆమెపై ఓ వ్యక్తి దాడి చేసి చంపేశాడు.
ఆమె వద్ద ఉన్న డబ్బులు దొంగిలించి, బండరాయితో కొట్టి చంపి పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. సీసీ టీవీ దృశ్యాలను చూసిన పోలీసులకు ఓ విషయం స్పష్టం అయింది. ఈ మూడు హత్యలు చేసింది ఒకే వ్యక్తి అన్న ధ్రువీకరణకు వచ్చారు. పాత నేరస్తుడైన తన్నీరు అంకమ్మరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంకమ్మరావును సైకో కిల్లర్‌గా భావిస్తున్నారు. మూడు హత్యలు ఇతడే చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇతడు గతంలో ఓ వృద్ధురాలి హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే, సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టు ఇతడిపై కేసును కొట్టివేసింది.
అంతేకాదు! ఇతడిపై ఇప్పటికే 10 దోపిడీ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడు హత్యలు కూడా అతడే చేసి ఉంటాడని పోలీసులతో పాటు స్థానికులు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న వారిపై అంకమ్మరావు దాడులకు పాల్పడి హత్య చేస్తున్నాడని.. వారి వద్ద ఉన్న డబ్బులు దోచుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. పగలు పేపర్లు ఏరుకునే వాడిలా నటిస్తూ రాత్రి వేళల్లో హత్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి, చిల్లర డబ్బుల కోసం హత్యలు చేస్తున్నాడని భావిస్తున్న సైకో కిల్లర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.