ఆడవారికి.. ఆడవారే శత్రువులు అని కొందరు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. కొందరు మహిళలు తాము ఆడవారిమే అన్న విషయం మరచి.. మగ పిల్లవాడు కావాలంటూ కోడళ్లను వేధిస్తుంటారు. మరికొందరు మగపిల్లాడు పుట్టలేదని విడాకులు ఇవ్వడం చేస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి.. పురిటిలోనే ఆ బిడ్డను హత్య చేస్తున్నారు. మరికొందరు పురిటిలోని బిడ్డతో సహా కోడల్ని హత్య చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటననే ఒకటి చోటుచేసుకుంది. ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో అత్తమామలు కోడలిపై విష ప్రయోగం చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…
గుంటూరు జిల్లాలోని సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి వేణుతో బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి 2020లో వివాహమైంది. 2021లో శ్రావణికి మొదటి సారి గర్భవతి అయింది. తమకు త్వరలో వారసుడు వస్తాడని వేణు తల్లిదండ్రులు ఆశగా ఉన్నారు. అలాంటి సమయంలో శ్రావణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేణు తల్లిదండ్రులు కొంత నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం. అయితే ఈసారైన కొడుకు పుడతాడులే అని ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొన్ని నెలల క్రితం శ్రావణి రెండో సారి గర్భం దాల్చింది. అయితే ఈ సారి భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. రెండో సారి కూడా అమ్మాయి పుడుతుందని తెలుసుకున్నారు. దీంతో శ్రావణి అత్తమామలు తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.
మరోసారి ఆడబిడ్డ ఇష్టంలేని అత్తమామలు మజ్డిగ, పాలల్లో విష ప్రయోగం చేశారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా శ్రావణి రక్తంతో వాంతి చేసుకుంది. అందులో చిన్న పేగు ముక్కులు కూడా వచ్చినట్లు సమాచారం. దీంతో శ్రావణి ఆరోగ్య పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.