పుస్తకాలు చదవడాన్ని పెద్దవాళ్లే ప్రయాసగా భావిస్తున్నారు. ఇక చిన్న పిల్లల సంగతి అయితే చెప్పుకోనక్కరలేదు. నిద్ర లేచింది మొదలు పడుకునేవరకు సెల్‌ఫోన్స్‌కి అతుక్కుపోతున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా ఏదో మొక్కుబడిగా చదివేస్తున్నారు. ఇక కథల పుస్తకాల సంగతి సరేసరి. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డుల జాబితాలో తన పేరును చేర్చింది. అబుదాబిలో ఉంటున్న ఈ ఇండో అమెరికన్ అమ్మాయికి పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. బొమ్మలతో ఉన్న పుస్తకాలను చదవడానికి మరింత ఆసక్తి చూపిస్తుంది. కియారా పాపాయిగా ఉన్న సమయంలో తన తాతయ్య చెప్పే కథల్ని శ్రద్ధగా వినేదట. ఆ కథలే తర్వాతతర్వాత పుస్తకాలు చదవడానికి ప్రేరేపితమయ్యాయి. ఈ ఆసక్తి కాస్తా ఎక్కువై ఎక్కడికివెళ్లినా పుస్తకాల్ని వెంటతీసుకెళ్లడం బయట ఎక్కడన్నా పేపర్ ముక్క కనిపించినా చదివేయడం అలవాటుగా మారింది.
కియారా ఈ ఏడాది ఫిబ్రవరి 13న 105 నిమిషాలపాటు ఏకబిగిన 36 పుస్తకాలను చదివింది. దీంతో ఆమె లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్ట్ రికార్డులలో స్థానం సంపాదించింది. పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఫోన్లలో ఆటలు ఆడటం, వీడియో గేమ్స్ కంటే నాకు పుస్తకాలు చదవడమంటేనే ఇష్టం. ఆన్లైన్ లో కంటే పుస్తకాలను డైరెక్టుగా చదివేయడమే నాకు సౌకర్యంగా ఉంటుందని కియారా చెప్పింది. వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కియరా ను ‘బాల మేధావి’గా అభివర్ణించింది. ఇంత చిన్నవయసు లో కియరా పుస్తకాల పురుగుగా మారడం విశేషమని కితాబునిచ్చింది. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో కియరా రెండు వందలకు పైగా పుస్తకాలను చదివింది. పుస్తకాలు అయిపోవడంతో కొత్త పుస్తకాలకోసం ఎదురుచూసేది. కొన్ని సందర్భాల్లో చదివిన పుస్తకాలనే మళ్లీమళ్లీ చదువుతూ ఉండేది. విద్యార్థులు ఈ చిన్నారిని చూసైనా కాస్త పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం.