ఓ స్కూల్ టీచర్ విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. స్కూల్ కు బొట్టు పెట్టుకుని వచ్చిందని ఆ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక అవమానంగా భావించి కఠినమైన నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తప్పుదోవ పడుతున్నారు. కొందరు టీచర్లు వారి వికృత చేష్టలు, ప్రవర్తన కారణంగా ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల దారుణంగా వ్యవహరించాడు. పాఠశాలకు బొట్టుపెట్టుకుని విద్యార్థిని రావడంతో ఆవేశంతో ఊగిపోయాడు. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్థిని ఎవ్వరు ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో ఆ టీచర్ పై విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ పాఠశాలకు చెందిన బాలిక నుదిటిపై బొట్టు పెట్టుకుని స్కూల్ కు హాజరయ్యింది. దీంతో ఆగ్రహించిన ఆ టీచర్ బొట్టు ఎందుకు పెట్టుకొచ్చావంటూ బాలికను కొట్టాడు. టీచర్ తనపై చేయి చేసుకోవడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థిని షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఈ విషయాన్ని సంబందిత అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ట్వీట్ చేశారు. బొట్టుపెట్టుకొచ్చిందన్న కారణంతో బాలికను టీచర్ కొట్టడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.