ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. అయితే చాలా మటకు పెళ్లి పీటల మీద జరిగే గొడవలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా ప్రత్యేకం. ఆ వివరాలు..
సాధారణంగా పెళ్లి ఇంట విందు అంటే ఎంత సింపుల్‌గా ఏర్పాటు చేసినా 4-5 రకాల ఐటమ్స్, స్వీట్స్ లాంటివి పెడతారు. ఇక ఈ మధ్య కాలంలో బఫే భోజనాలు ట్రెండ్. అంటే వచ్చిన అతిథులను కూర్చోబెట్టి.. కొసరి కొసరి వడ్డించే సంప్రదాయానికి చరమగీతం పలికి.. ఎవరి ప్లేట్ వారు తీసుకుని.. లైన్‌లో వెళ్లి కావాల్సిన ఆహార పదార్థాలు వడ్డించుకుని రావడమే. ఏదో ఓ గుంపులో దూరి.. చేతిలో ప్లేట్‌ను మోస్తూ.. లాగించేయాలి. చాలా మంది ఇలా నిలబడి తినలేక.. ఏదో తిన్నామా అంటే తిన్నాం అన్నట్లు మమ అనిపించేస్తారు. వచ్చిన అతిథులను కూర్చొబెట్టి వారికి కొసరి కొసరి వడ్డించే మర్యాదలకు కాలం చెల్లింది. కానీ నేటికి అక్కడో ఇక్కడో కొందరు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అతిథితులను కూర్చొపెట్టి.. ఘనంగా మర్యాదలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. దీన్ని చూసిన వారు.. అంబానీ కూడా తన బిడ్డల పెళ్లిళ్లకు కూడా ఈ రేంజ్‌లో ఏర్పాట్లు చేసి ఉండడు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విందులో అంత ప్రత్యేకత ఏం ఉంది అంటే..
పెళ్లికి వచ్చిన అతిథులకు ఘనంగా ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన వీడియో ఇది. అయితే ఈ గ్రాండ్ విందు ఎక్కడ జరిగింది.. ఎవరు ఏర్పాటు చేశారు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇక పెళ్లికి వచ్చిన బంధువులకు వరుసగా సింహాసనం లాంటి కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారికి పలు రకాల ఆహార పదార్థాలు వడ్డించారు. అలా వడ్డించినవి ఖరీదైన బంగారు, వెండి, పింగాణి ప్లేట్లు కాదు. మనం రాజుల కాలంలో హంస తూలికా తల్పాలు, నెమలి సింహసానాల గురించి విని ఉన్నాం. ఇక్కడ పెళ్లి నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందులో ఆహార పదార్థాలను వడ్డించేందుకు నెమలి డిజైన్‌లో ఏర్పాటు చేసిన ప్లేట్‌లలో ఆహార పదార్థాలను వడ్డించారు.
ఈ భారీ డిజైనర్ ప్లేట్‌లలో అరిటి ఆకులు వేసి.. రకరకాల ఆహార పదార్థాలు వడ్డించారు. వడ్డన కోసం ప్రత్యేకంగా కొంత సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు అతిథులను పర్యవేక్షిస్తూ.. ఎవరికి ఏం కావాలో.. చూస్తూ.. కొసరి కొసరి వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. అంబానీ కూడా తన ఇంట జరిగే ఫంక్షన్‌లలో ఇంత భారీ ఏర్పాట్లు చేసి ఉండడు కదా.. అతిథిదేవో భవ అన్న సూత్రాన్ని నిండు మనసుతో ఆచరించినట్లు అనిపిస్తోంది.. ఇలాంటి గ్రాండ్ విందును ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ గ్రాండ్ విందుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.