నాన్న.. ఈ మాట కేవలం 2 అక్షరాలు మాత్రమే కాదు. ఒక జీవితం మొత్తానికి సరిపోయే దైర్యం. పక్కన నాన్న ఉంటే చాలు ఎంతటి కష్టమైనా చిన్నది అయిపోతుంది. మన భారాన్ని, బాధని పంచుకోవడానికి ఒక తోడు ఉందన్న దైర్యం వస్తుంది. అలాంటి నాన్న లేక అనాధగా పెరిగే పిల్లలు ఎంత మందో ఉన్నారు. కానీ.., చనిపోయాడనుకున్న నాన్న 33 సంవత్సరాల తరువాత బతికే ఉన్నాడని తెలిస్తే.., అది కూడా జైలులో ఖైదీగా ఉన్నాడని తెలిస్తే..! ఆ పరిస్థితిని మాటల్లో చెప్పలేము. సరిగ్గా ఇలాంటి ఘటనే తిరువనంతపురంలో చోటు చేసుకుంది. పాల్ఘాట్ అనే ఉళ్లో ఉంటున్న అజిత చిన్న తనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రిని ఆమె 6 నెలల చిన్నారిగా ఉన్నప్పుడే పోలీసులు పట్టుకెళ్లారు. దానికి కారణం రాజకీయ పార్టీ కార్యకర్త అయిన శివాజీ.. ఏదో హత్య చేశాడని అభియోగం. రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట జైలుకు వెళ్లాడు. ఈ కారణంగానే అతని భార్య మతిస్థిమితం తప్పి మరణించింది. అలా అజిత చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయ్యింది.
అజిత పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్. వద్దన్నా తమ ఇంటి ఆడపిల్లను చేసుకుని, పార్టీ అని తిరిగి.., ఈ కష్టాలన్నీ తెచ్చాడని అల్లుడి మీద కోపం పెట్టుకున్న అత్తమామలు అజితను పెంచి పెద్ద చేసే క్రమంలో ఆమె తండ్రి చనిపోయాడని.., అతని డీటైల్స్ చూచాయగా చెప్పారంతే. దాంతో అజిత తన తండ్రి మరణించాడని అనుకుంది. తరువాత అజిత అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెద్దదయ్యింది. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలు. రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలు. ప్రాణంగా చూసుకునే భర్త. రజితకి జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ.., అమ్మ, నాన్న ప్రేమని పొందలేకపోయాను అని ఆమె నిత్యం బాధపడుతూ ఉండేది. కానీ.., ఇక్కడే ఓ విచిత్రం చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో ఓ ఖైదీ జీవితం ఆసక్తిని కలిగించింది. తన తండ్రి పేరు, హత్య కేసుతో పోలిక ఉండటంతో అజిత మనసులో ఎక్కడో అనుమానం మొదలైంది. వెంటనే తన అమ్మమ్మ వాళ్ళని నిలదీసి ప్రశ్నించింది. వారి దగ్గర నుండి సరైన సమాధానం రాలేదు. అయినా.., అజిత తన ప్రయత్నాలు ఆపలేదు. జైలు అధికారులను కలిసింది. ఆ ఖైదీ వివరాలు కావాలని.., ఆ కేసు వివరాలు కావాలని 4 నెలల పాటు ఫైట్ చేసింది. చివరికి అజిత కష్టానికి ఫలితం దక్కింది. ఆ కేసు వివరాలు అన్నీ మ్యాచ్ అయ్యాయి. జైలులో ఉన్న ఆ ఖైదీ మరెవ్వరో కాదు.., అజిత తండ్రే అని నిర్ధారణ అయ్యింది.
ఇక అక్కడ నుండి ఆ కూతురి మనసు ఆగలేదు. పరుగున వెళ్లి జైలులోనే తండ్రిని కలిసింది. ఇన్నాళ్ల తరువాత తనని వెతుక్కుంటూ వచ్చిన తన బిడ్డను చూసి ఆ తండ్రికి కన్నీరు ఆగలేదు. ఆమె ముందు చిన్న పిల్లాడైపోయి ఏడ్చేశాడు. నన్ను క్షమించు తల్లి అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అజిత పరిస్థితి కూడా ఇంతే. ఇక్కడ నుండి అజిత తన తండ్రిని బయటకి తీసుకోవడనికి ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. 32 ఏళ్లుగా నా తండ్రి జైలులోనే ఎందుకు ఉన్నాడని పోలీసులను ప్రశ్నించింది. నిజానికి.. శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయితే శిక్షాకాలంలో అతను నాలుగు సార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో ఇప్పటి వరకు జైలులో ఉండిపోవాల్సి వచ్చింది. జైలులో ఉన్న తండ్రిని విడిపించుకోవడానికి అజిత తెలిసిన వాళ్లందరి దగ్గరకూ పరిగెత్తింది. అయినా.., తండ్రిని విడిపించుకోలేకపోయింది. అక్కడ నుండి అవకాశం ఉన్న ప్రతిసారి ఆమె జైలుకి వెళ్ళేది. తన చేత్తో చేసిన ఆహారం తండ్రికి ఇష్టంగా పెట్టేది. అయినా.., నాన్న బయటకి వస్తే బాగుండు. ఆయన్ని ఈ వయసులో నా దగ్గర ఉంచుకొని చూసుకుంటే బాగుండు అన్న ఆలోచనలు రజితకి నిద్ర పట్టనిచ్చేవి కాదు. విచిత్రం ఏమిటో తెలుసా? ఈ స్వచ్ఛమైన రక్త సంబంధానికి ప్రకృతి సైతం సహకరించింది. చివరకు కరోనా ఈ తండ్రి కూతురుని దగ్గర చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంలో భాగంగా శివాజీకి కూడా 3 నెలల పెరోల్ ఇచ్చారు పోలీసులు. వెంటనే అజిత వెళ్లి తండ్రిని తెచ్చుకుంది. 65 ఏళ్ల వయసు ఉన్న శివాజీ కూతురిని చూడటం ఒక ఉద్వేగం. బయటకి వచ్చాక అజిత తన తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేసింది. ఇప్పుడు శివాజీ తన కూతురు దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఆ తండ్రికి ఈ కూతురే అమ్మ. చూశారు కదా.. విధి ఎంత విచిత్రమైనదో. కానీ.., తల్లిదండ్రులను భారంగా భావించే బిడ్డలు ఉన్న ఈరోజుల్లో.., తన తండ్రి కోసం అజిత చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇందుకే అజితకి కామెంట్స్ రూపంలో మీ అభినందనలు తెలియచేయండి.