మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. సొంత మనవడిని అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించాడు. సదరు వ్యక్తి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఎన్నో కుటుంబాలను మద్యం చిన్నాభిన్నం చేస్తుంది. ఎందరో దీనికి బానిసలు గా మారి.. నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మద్యం కారణంగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో కొందరు పశువుల్లా మారి సొంత బిడ్డలపైనే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొందరు మద్యం కోసం ఘోరమైన పనులకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం కోసం ఏకంగా మనవడినే అమ్మేశాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాకీంపేట్ లో ఖలీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఖలీల్ మద్యానికి బానిసగా మారి ఇంట్లో వారితో గొడవలు పడే వాడు. నిత్యం మద్యం సేవిస్తూ సోమరిగా తిరుగుతుంటాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేసేవాడు. వారు డబ్బులు ఇవ్వడానికి ససేమిరా అంటే ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి మరీ.. మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఖలీల్ కుమార్తె ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. అలానే ఇటీవలే మధ్యే పండంటి మగబిడ్డకు జన్మిచ్చింది. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం ఖలీల్ డబ్బుల కోసం ఇంట్లో వారితో గొడవలు పడ్డాడు. వారు డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు.
ఇంట్లో వాళ్లు పనుల్లో ఉండగా .. రోజుల వయసున్న మనవడిని ఖలీల్ ఎత్తుకెళ్లాడు. ఆ బాబును అమ్మేసి.. వచ్చిన డబ్బులతో మద్యం సేవించాడు. ఇదే సమయంలో బాబు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు.చివరకు కొడుకు కనిపించడంలేదని ఖలీల్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మద్యం డబ్బుల కోసం సొంత మనవడినే అమ్మిన ఖలీల్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.