దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతూ ఉన్నా.., పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే పోతున్నాయి. ఇక కరోనా కల్లోలం కి తోడు ఇప్పుడు కొత్తగా ఫంగస్ కి జనాలకి నిద్ర లేకుండా చేస్తోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే దేశంలో మరణాలు సంభవించాయి. ఈ నేపధ్యంలో ఎయిమ్స్ డాక్టర్స్ బ్లాక్ ఫంగస్ కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడానికి కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ పీ శరత్ చంద్ర కుండబద్దలు కొట్టారు. గతంలో ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ శరత్ చంద్ర పేర్కొన్నారు.అదుపులో లేని మధుమేహం వ్యాధి వల్ల కూడా మూకోమైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ స్ప్రెడ్ అవుతున్నదని చెప్పారు. ఒకవైపు ఆక్సిజన్ తీసుకుంటూ.., కరోనా చికిత్సలో భాగంగా టోసిలిజుమాబ్ వంటి స్టెరాయిడ్స్ వాడటం మరో కారణం అన్నారు. ఆరు వారాల్లో కరోనా చికిత్స పొందిన రోగులకు బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యే ముప్పు పొంచి ఉందన్నారు.
అలాగే రోగుల ప్రాణాలను కాపాడేందుకు సిలిండర్ నుంచి శీతల ఆక్సిజన్ అందించడం చాలా ప్రమాదకరం అని డాక్టర్ శరత్ చంద్ర స్పష్టం చేశారు. ఒకే మాస్క్ 2-3 వారాలు వాడటం కూడా బ్లాక్ ఫంగస్ అభివ్రుద్ధి కావడానికి మరో కారణం అని చెప్పారు.బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గిపోవాలంటే యాంటీ ఫంగల్ డ్రగ్ పొసాకోనాజోల్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉండొచ్చునన్నారు. ప్రత్యేకించి బ్లాక్ ఫంగస్ హై రిస్క్ కేసుల్లో ప్రమాదం తగ్గించొచ్చునన్నారు. ఎపిడమిక్ ప్రపోర్షన్లు ఎందుకు పెరుగుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు డాక్టర్ శరత్ చంద్ర. దీని వ్యాప్తికి బహుళ కారణాలు ఉండొచ్చునని అంచనా వేశారు. పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండటంతో అల్లాడిపోతున్నాయి.రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశాయి. దీని ప్రకారం ప్రతి బ్లాక్ ఫంగస్ కేసును రాష్ట్ర ప్రభుత్వానికి దవాఖానలు నివేదించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా కారణంగా అల్లాడుతున్న ప్రజానికానికి ఈ బ్లాక్ ఫన్గ్స్ బాధ ఎప్పుడు వదులుతుందో చూడాలి.