హెల్త్ డెస్క్- కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా మహమ్మారికి జన జీవనం అస్థవ్యస్థం అయ్యింది. ప్రధానంగా కరోనాతో భారత దేశం అల్లాడిపోతోంది. ఇక కరోనా చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కలకల రేపుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని బ్లాక్ ఫంగస్ కేసులు ఒక్క భారత్ లోనే నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి రకరకాల రూపాల్లో వచ్చి దాడి చేస్తోంది. కరోనా కంటే బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ కు గురవుతున్న బాధితుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ వైరస్ చాలా వేగంగా ఊపిరితీత్తుల్లోకి చేరుతోంది. దీంతో బాధితులు ఆక్సిజన్ తీసుకోడానికి ఇబ్బందిపడి చనిపోతున్నారు.
బ్లాక్ ఫంగస్ మ్యుకర్‌మైకోసిస్ అని వైద్య భాషలో పిలుస్తున్నారు. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తోంది. మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఈ ఫంగస్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు కూడా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురవ్వుతున్నారు. బాధితులకు కరోనా కంటే ముందుగానే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. బ్లక్ ఫంగస్ కు గురయ్యే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల వెల్లడించారు. మొదట్లోనే దీన్ని గుర్తిస్తే వ్యాధిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ ఎవరికి ఎక్కువగా సోకుతుందంటే.. షుగర్ వ్యాధి నియంత్రణలో లేని కరోనా బాధితులు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్లు గుర్తించారు. కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో కూడా బ్లాక్ ఫంగస్ ఏర్పడుతోంది. కరోనా సోకక ముందు నుంచే అనారోగ్య సమస్యలున్న బాధితులకు స్టిరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు.సైనసైటిస్ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాలను చూసినట్లైతే.. బ్లాక్ ఫంగస్ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి పుడుతుంది. బ్లాక్ ఫంగస్ వల్ల కళ్లు ఎర్రబడటంతో పాటు, ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి. తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో మానసిక స్థితి అదుపుతప్పడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక ముక్కులో దురద, కళ్ల పైన లేదా కళ్ల కింద ఉబ్బినట్లు కనిపించినా, కంటిచూపు మందగించినా బ్లాక్ ఫంగస్ గా అనుమానించాల్సి ఉంటుంది. అంతే కాకుండా దంతాల్లో నొప్పిగా ఉన్నా జాగ్రత్త పడాల్సిందే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిపై కూడా బ్లాక్ ఫంగస్ అటాక్ చేయవచ్చు. ఐతే కరోనా బాధితులందరికి బ్లాక్ ఫంగస్ సోకదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక బ్లాక్ ఫంగస్ సోకిన వారు తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్యులను సంప్రదించాలి. కరోనా చికిత్స తిసుకుంటున్న వారు, లేదా ఇప్పటికే చికిత్స తీసుకున్న వారు ఇదివరకు ఏమైనా వ్యాధులలతో బాధపడినా, శస్త్ర చికిత్సలు చేయించుకున్నా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. కరోనా చికిత్స అందించే వైద్యులకు ముందుగా మీ అనారోగ్య సమస్యలను చెబితే, బ్లాక్ ఫంగస్ సోకకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవడంతో పాటు, మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడకుండా జాగ్రత్త పడటం వల్ల బ్లాక్ ఫంగస్ అటాక్ చేయకుండా రక్షించుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి వైద్యులు కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ మేరకు వైద్యం అందిస్తున్నారు.