న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు రోజువారి కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో పండగల సీజన్ మొదలవుతోంది. మొన్న వినాయక చవితి అయిపోయిందో లేదో.. ఇక ఇప్పుడు విజయ దశమి, దీపావళి పండగలు వచ్చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం కరోనా నిబంధనల విషయంలో మరోసారి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కానీ ప్రజలు మాత్రం కరోనా పోయిందన్న ఆలోచనలో కరోనా ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేటతెల్లం అయ్యింది.
చాలా వరకు ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు, భౌతిక దూరాన్ని పాటించడం లేదని ఈ సర్వేలో తేలింది. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కేవలం 13 శాతం మంది మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారని ఈ అధ్యయం చెబుతోంది. ఇక కేవలం 6 శాతం మంది మాత్రమే భౌతిక దూరం పాటిస్తున్నారని సర్వేలో తేలింది. కమ్యూనిటీ ఆధారిత ప్లాట్ ఫామ్ లోకల్ సర్కిల్స్ దేశంలోని 366 జిల్లాల్లో 65 వేల మంది నుంచి ఈ వివరాలు సేకరించింది.
లోకల్ సర్కిల్స్ జూన్ లో చేసిన అధ్యయనం ప్రకారం 29 శాతం మంది మాస్క్‌లు ధరిస్తుండగా, 11 శాతం మంది భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖనే మీడియాకు వెల్లడించింది. అన్నట్లు భారత్ లో శనివారం 18 వేల 166 మందికి కరోనా నిర్ధారణ కాగా, 214 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.30 లక్షలకు పడిపోయాయి.