ఆడపిల్లలను వర్ణించడానికి మాటలకి కొదవా? అమ్మాయిలను సృష్టితో, ప్రకృతితో, భువితో , దివితో, బంగారంతో, పక్షులతో, సమస్త జీవరాశులతో దేనితో అయినా పోలుస్తూ అద్భుతమైన కవితలు రాసేస్తారు. అయితే ఎక్కువగా అమ్మాయిలను వర్ణించే పదం ఒకటి ఉంది. అదే పదహారణాల తెలుగమ్మాయి. ఆడపిల్లలను పదహారణాల అమ్మాయి అని, పదహారణాల తెలుగమ్మాయి అని అంటూ ఉంటారు. మన పాటల రచయిత చంద్రబోస్ రాసిన.. పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. పాటలో కూడా పదహారణాల తెలుగు అమ్మాయి గురించి ప్రస్తావించారు. అసలు పదహారణాల అమ్మాయి ఏంటి? పదహారు అణాలకి, అమ్మాయికి సంబంధం ఏమిటి? పదహారణాల అమ్మాయి అన్న పదం ఎలా వచ్చింది?
ఇప్పుడంటే 2 వేల నోట్లు (కనబడుటలేదనుకోండి), 500 నోట్లు, వంద నోట్లు, రూపాయి నాణాలు వంటివి చెలామణి అవుతున్నాయి గానీ ఒకప్పుడు రూపాయి కంటే ముందు అణాలు ఉండేవి. రూపాయి అంటే వంద పైసలు. అణా విలువ రూపాయిలో 16వ వంతు. అంటే దీని విలువ 6.25 పైసలు. చారణా అంటే 25 పైసలు. చార్ అంటే నాలుగు అని అర్థం. అలానే ఆటణా (8) అంటే 50 పైసలు. బారణా (12) అంటే 75 పైసలు. పదహారు అణాలు అంటే 100 పైసలు. అంటే రూపాయి అని, నూటికి నూరు శాతం అని అర్థం. తెలుగు అమ్మాయిలు నూటికి నూరు శాతం పరిపూర్ణంగా ఉంటారు అని చెప్పడానికి సంకేతంగా పదహారణాల అమ్మాయి, పదహారణాల తెలుగమ్మాయి అని వాడుకలోకి తీసుకొచ్చారు.
పదహారణాల కలిస్తే నూరు పైసలు అయినట్టు.. పదహారు అలంకారాలు కలిగి ఉండే అమ్మాయిలను పదహరణాల అమ్మాయి అని అంటారు. దంతధావనం, నలుగు పెట్టి స్నానం చేయడం, పసుపు రాసుకోవడం, చీర, రవిక ధరించడం, కాళ్ళకు పారాణి, పొడవాటి జుట్టుని చక్కగా దువ్వుకోవడం, జడ నిండుగా పూలు పెట్టుకోవడం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం, కళ్ళకు కాటుక, నుదిటిన బొట్టు, బుగ్గన చుక్క, పెదాలకు ఎర్రని రంగు, చేతులకు గోరింటాకు, తాంబూలం, సర్వాభరణ అలంకరణ అంటే చెవిలీలు, ముక్కు పుడక, బంగారం లేదా రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకోవడం.. ఇవి మొత్తం 16 అలంకారాలు.
ఈ 16 అలంకారాలను ఆచరించే తెలుగు అమ్మాయిని లేదా స్త్రీని పదహారణాల తెలుగు అమ్మాయి అని అంటారు. అదన్నమాట విషయం.. భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్రధారణలో ఇలా ప్రతీ విషయంలో తెలుగుతనం ఉట్టిపడేలా తనలోని ఇన్ని గుణాలను నింపుకున్నది కాబట్టి ఆ అమ్మాయిని సంపూర్ణమైన అమ్మాయికి సంకేతంగా పదహారణాల అమ్మాయి అని పిలవడం జరిగింది. ఈ పదహారణాల తెలుగమ్మాయిలు పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటారు. అందుకే సినిమాల్లో ఆ పాత్రలను పదహారణాల తెలుగమ్మాయి అంటూ సాహిత్యంలో జోడించేస్తారు. మరి అమ్మాయిలను పదహారణాల తెలుగమ్మాయి అని అనడానికి మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.