సీనియర్ల వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి పలు హమీలు ఇచ్చింది. ఆ వివరాలు..
సీనియర్ విద్యార్థుల వేధింపుల తాళలేక.. వరంగల్ కేఎంసీ కాలేజీలో పీజీ చదవుతున్న మెడికో ప్రీతి.. ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ కారణంగా ప్రీతి మృతి చెందినట్లు.. వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రీతి మృతి నేపథ్యంలో విపక్షాలు.. అధికార టీఆర్‌ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. బీజేపీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు, నిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశాయి. నిందితులను వదిలి పెట్టం అంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హమీ వచ్చిన తర్వాతనే తమ ఆందోళన విరమించాయి.
ఈ క్రమంలో మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తొలుత ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను పెంచింది. ఆదివారం రాత్రి రూ.10 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కానీ అర్థరాత్రి తర్వాత ఎక్స్‌గ్రేషియా పెంచడంతో పాటు పలు బాధితురాలి కుటుంబానికి పలు కీలక హామీలను ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నత ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘‘ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఆ కుటుంబం అనుభవిస్తోన్న దుఖాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రీతి మృతి పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దోషులు ఎంతటి వారైనా సరే.. కఠినంగా శిక్షిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రీతి ఆత్మ శాంతించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం.. వారి కుటంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అన్నారు మంత్రి ఎర్రబెలలి.
అలాగే ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించడంతో పాటు హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్‌ను బదిలీ చేసేందుకు వైద్యాశాఖ మంత్రి హరీష్ రావు అంగీకరించారు. ప్రీతి ఘటనపై నిజనిర్ధారణ కమిటీ కూడా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ప్రీతి కుటుంబసభ్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులు, విపక్షాలు, విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ డిమాండ్లను నేరవేర్చి, బాధ్యతులపై చర్యలు తీసుకుంటేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు పరిస్థితి సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హమీలు రావడంతో.. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. దాంతో ప్రీతి మృతదేహాన్ని నిమ్స్ నుంచి గాంధీ హాస్పిటల్ తరలించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన అనంతరం ఆమె స్వగ్రామమైన వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్నితండాకు తరలించారు. జనగాం జిల్లా మెండ్రాయిలో నేడు ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.