హైదరాబాద్ నగరంలో.. సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే.. పెద్ద ప్రయాస. ఉదయం ఎనిమిది గంటల నుంచి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. రాత్రి వరకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతాయి. ఇక సిటీ బస్సుల కోసం వేచి చూడటం అంత నరకం మరొకటి ఉండదు. ఆఫీస్‌కు టైమ్‌కు చేరుకోవాలంటే.. ఇంట్లోనే గంట ముందు బయలుదేరాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఇక ఆరోజు ఆఫ్ డేనే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక కొత్తవాళ్లకైతే మరిన్ని ఇబ్బందులు. తాము వెళ్లాలనుకున్న ప్రాంతానికి ఏ బస్సులు వెళ్తాయి.. ఎప్పుడు వస్తాయో అర్థం కాక.. ఈ బాధలు పడే బదులు.. రెండు, మూడు వందలు చెల్లించి మరీ క్యాబ్, ఆటోల్లో వెళ్తుంటారు. అయితే త్వరలోనే ఈ కష్టాలకు చెక్ పెట్టనుంది టీఎస్‌ఆర్టీసీ.
ట్రిప్పు తగ్గకుండా, బస్సు రద్దు అవకుండా, మధ్యలోనే మలుపు తిరిగి వెనక్కి వెళ్లకుండా నిర్దేశించిన బస్సు సర్వీసులన్నీ రోడ్డెక్కి తిరిగేలా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగా.. ఇక మీదట అన్ని బస్సుల్లో.. వీటీఎస్‌ను (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్) అమర్చనుంది. గతంలో మెట్రో బస్సులకు జీపీఎస్‌ను అమర్చి బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే కరోనా కారణంగా దాన్ని అమలు ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ విమానాశ్రయానికి వెళ్లే బస్సుల్లో వీటీఎస్‌ను అమర్చడంతో.. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.
ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసి.. మెట్రో బస్సుల్లో కూడా వీటీఎస్‌ను అమర్చేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం నగరంలో మొత్తం 2,850 సిటీ బస్సులు ఉండగా.. వీటిల్లో 1,350 మెట్రో ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. వీటి కాల పరిమితి కూడా మరో నాలుగైదేళ్లు ఉండడంతో ఈ బస్సులకు కూడా వీటీఎస్‌ను అమర్చుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులు 28 వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. ఇవి ఎక్కడా రద్దు అవకుండా.. అర్ధాంతరంగా ఆపేయకుండా.. చూడాలని ఆర్టీసీ ప్రయత్నిస్తోంది.
అందుకోసం సిటీ బస్సులో వీటీఎస్‌ను అమర్చడమే కాక.. గ్రేటర్ హైదరాబాద్ సిటీ బస్సు అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రానుంది. దీని ద్వారా బస్సులకు సంబంధించిన సమాచారం అందించనున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు, ఏ మార్గంలో ప్రయాణిస్తారు వంటి వివరాలు ఆ యాప్‌లో పొందుపరిస్తే.. ఆ రూట్‌లో నడిచే బస్సుల నంబర్లతో పాటు.. వాటి టైమింగ్స్ వివరాల సమాచారం సెల్‌ఫోన్‌లో కనిపిస్తుంది. ఆ ప్రకారం మీరు వెళ్లే బస్సు ఏ సమయంలో వస్తుందో తెలుసుకుని బస్టాపుకు చేరుకోవచ్చు. బాగా లేటవుతుంది అనుకుంటే.. వేరే ఏర్పాట్లు చేసుకోవచ్చు. మరి టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం వల్ల బస్సుల కోసం ఎదురు చూసే తిప్పలు తప్పుతాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.