తీన్మార్ మల్లన్న ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అధికార పార్టీ పై తనదైన విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా హన్మకొండలో భూసేకరణ రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన గొడవకు దారి తీసింది. ఆ సమయంలో తీన్మార్ మల్లన్నను రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. ఇదెక్కడి అన్యాయం.. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తే అరెస్ట్ చేస్తారా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లన్న.
ఈ నేపథ్యంలో పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని శక్తులు వచ్చినా.. ఎంత మంది అడ్డు చెప్పినా.. జీఓ 80ను వ్యతిరేకంగా పోరాడి రైతులకు మద్దతు ఇస్తానని మల్లన్న అన్నారు. తనపై పోలీసుల అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు.
పేదలు, రైతుల గురించి తాను నిరంతరం పోరాడుతా అని.. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని అన్నారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.