ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడుల్లో చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తూనే ఉన్నాం. మొన్న అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపాయి.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించింది.
హైదరాబాద్ అంబర్ పేట్ లో కొన్ని వీధి కుక్కలు నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించింది. ఈ హృదయవిదారకమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం పై ప్రజలు సీరియస్ అయ్యారు.. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం సీఆర్పీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఆదివారం ఉదయం కుక్కలు స్వైర విహారం చేశాయి.. రత్నమ్మ అనే వృద్దురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తన ఇంటి ముందు కూర్చొని ఉండగా అకస్మాత్తుగా వీధి కుక్కలు ఆమెపై దాడి చేశాయి.. వృద్దురాలు బాధతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు.. అందులో కొన్ని స్థానికులపై అటాక్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.
ఇక రత్నమ్మ పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కు కుట్లు కుట్లు వేశామని.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ పట్టణంలో విపరీతంగా కుక్కలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.