ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
బీసీ కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆర్థిక సహాయం పొందేందుకు అవకాశం కల్పించింది. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెబ్ సైట్ ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈరోజు నుంచి అంటే జూన్ 9 నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు. కుల వృత్తులు చేసుకునేవారికి, చేతి వృత్తులు చేసుకునే వారికీ పనిముట్లు, ముడిసరుకులు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ సాయం అందించనుంది. ఈ ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునేవారు మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించిన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ జిల్లా, నియోజకవర్గం, మండలం, పంచాయితీ, గ్రామం, ఇంటి నంబర్, చిరునామా, వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ కార్డు నంబర్, ఆధార్ లో ఉన్న పేరు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్ (రేషన్ కార్డు నంబర్), తండ్రి లేదా భర్త పేరు, లింగం నమోదు చేయాలి. దివ్యాంగులు ఐతే యస్ అని, లేదంటే నో అని ఎంపిక చేయాలి. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే గ్రామీణం (రూరల్) అని, పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే పట్టణం (అర్బన్) అని ఎంపిక చేయాలి. వివాహం అయితే అయ్యిందని, లేదంటే కాలేదని ఎంపిక చేసుకోవాలి. విద్యార్హతలు ఎంపిక చేయాలి. నిరక్షరాస్యులైతే నిరక్షరాస్యులని, ఇంకా ఏమైనా చదివితే ఆ చదువుని ఎంపిక చేసుకోవాలి.
కులం పేరు, కుల ధ్రువీకరణ పత్రం సంఖ్య, క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఉన్న పేరు, ఉపకులం, ఆదాయ పత్రం నంబర్, ఆదాయ పత్రం ప్రకారం దరఖాస్తుదారుని పేరు, వార్షిక ఆదాయం, పుట్టిన తేదీ, వయసు, మొబైల్ నంబర్, వేరొకరి మొబైల్ నంబర్, ఇంట్లో 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఆర్థిక సహాయం ఎందుకు పొందాలని అనుకుంటున్నారో ఎంపిక చేసుకుని.. బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు పేరు, బ్యాంకు శాఖ పేరు వంటి బ్యాంకు వివరాలు ఇవ్వాలి. పాన్ నంబర్ నమోదు చేసి.. దరఖాస్తుదారుని ఫోటో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకుని అన్ని వివరాలు కరెక్ట్ అయితే సబ్మిట్ చేయాలి. ఇలా చేస్తే అధికారులు తనిఖీ చేసి మీరు అర్హులైతే కనుక మీ ఖాతాల్లో నేరుగా లక్ష రూపాయలను బదిలీ చేస్తారు.