పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో పంపిణీ చేయడంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యతైతే ఉంటుందో రేషన్ డీలర్లకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. తమ వద్దకు వచ్చిన సరుకులను ప్రజలకు పంపిణీ చేయడంలో డీలర్ల కృషి ఎనలేనిది.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సరుకుల పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్న రేషన్ డీలర్లు కొంత కాలం నుంచి తమకు కమీషన్ పెంచాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, భద్రత కావాలని, గౌరవ వేతనం ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ డీలర్లు 22 డిమాండ్లతో ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం స్పందించకుంటే జూన్ 5 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో రేషన్ డీలర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. దీంతో రేషన్ డీలర్లు సమ్మె విరమించుకున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ తదితరులు రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
రేషన్ డీలర్ల సమస్యలకు పరిష్కారం చూపుతూ.. ఈ రోజు రేషన్ డీలర్ల సంఘాలతో చర్చలు జరిపిన కేసీఆర్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ ను క్వీంటాల్ కు రూ. 70 నుంచి రూ. 140 రూపాయలకి పెంచుతున్నట్లు ప్రకటించింది. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో పాటు కరోనాతో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రకటనతో రేషన్ డీలర్లు ఆనందంలో మునిగిపోయారు. తమ సమస్యలను తీర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.