కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ పేరు ప్రస్తుతం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత వారం రోజులుగా ఈ పేరే వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ ని వీడటం, మరేదో పార్టీలో చేరడం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు చేయడం, వాటిపై తిరిగి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం.. ఇలా అప్‌డేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు.
విషయం ఏంటంటే.. ఏ రాజకీయనాయకుడు అయినా పార్టీతో పడకపోతే వెంటనే వేరే పార్టీకి మారిపోతుంటారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పేసుకుంటూ ఉంటారు. కానీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం అలా చేయలేదు. ముందు తన నియోజకవర్గంలోని ప్రజలను కలిసి వారితో చర్చించిన తర్వాతే తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. తాను ఎందుకు వెళ్లిపోవాల్సి వస్తుందో వారికి వివరించారు. వారి నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.
ఇలా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలోకి వెళ్లకుండా రాజగోపాల్ రెడ్డి.. ముందే రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లనుండటాన్ని నియోజకవర్గ ప్రజలే కాదు నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. రాజీనామా చేసి నైతికంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తానేంటో నిరూపించుకున్నారంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.