దేశంలో గత కొంతకాలంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. దీనికి తోడు గ్యాస్ ధర కూడా పెరగడంతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి పలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీ తెలంగాణలో తాము చేసిన అభివృద్ది పథకాల గురించి తెలియజేస్తూ మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేస్తుందని.. అభివృద్ది ముసుగులో కోట్లు దండుకున్నారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది.. ఆ జోష్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తుంది. శుక్రవారం ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే.. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కొంత కాలంగా రాజకీయాలు భలే రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ ఏ చిన్న తప్పు చేసినా మీడియా ముందు ప్రతిపక్ష పార్టీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు అభివృద్ది పేరుతో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చడం లేదని.. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగవకాశాలు లేకుండా పోయాయని, రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో స్కాములు, ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే జోష్ తెలంగాణలో చూపించాలని కాంగ్రెస్ శ్రేణులు ఒక్కతాటిమీద నిలబడుతున్నారు. గతంలో తమలో తమకు భేదాభ్రిపాయాలు ఉన్నా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అందరూ కృషి చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అదే ఊపు కొనసాగించాలని.. బీఆర్ఎస్ కి చెక్ పెట్టేందుకు వ్యూహం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణనకు ఓ కార్యాచరణ రూపొందించారని సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కేసీఆర్ దత్తత గ్రామం మూఢుచింతలపల్లి లక్ష్మాపూర్ లో రచ్చబండ కార్యక్రమంలో భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ దే అన్న విషయం అధికార పార్టీ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేం ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ కట్టారో అక్కడ మీరు ఓట్లు అడగండి అంటూ సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించడానికే ఎక్కువ సమయం కేటాయించారని.. భూ కబ్జాలు తప్ప.. పేదల బాధలు ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడపడుచులు రూ.1250 గ్యాస్ బిల్లు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తప్పని సరై ఇళ్లలో కట్టెల పొయ్యితో వంటలు చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తే.. ఆడపడుచులకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని.. రూ. 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు తమ ప్రభుత్వం అధికాంరలోకి వస్తే.. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.