మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరూపించలేకపోతే పీసీసీ అధ్యక్ష పదవి వదులుకుంటారా అంటూ సూటిగా ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కు వ్యక్తిత్వం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "నాలుగు పార్టీలు మారిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులిచ్చి కొనుకున్నారు. ఇప్పుడు సీఎం అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారం తిట్టిన వ్యక్తి ఇప్పుడు మాకు నీతులు చెబుతున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నప్పుడు వీళ్లంతా ఏం చేశారు?" అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. "ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మునుగోడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లున్నారు. నాకు బీజేపీ కాంట్రాక్ట్ ఇచ్చిందని నిరూపిస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదు. యుద్ధం చేయడానికే నేను భాజపాలోకి వెళ్తున్నాను. నువ్వు మునుగోడుకు వస్తే డిపాజిట్ కూడా దక్కదు." అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.