ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. మొన్నీమధ్యే జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యాడు. పదవి దక్కాక తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇంకేముంది.. బంధువర్గం, అనుచరగణం, కార్యకర్తలతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కేకలు, నినాదాలతో హోరెత్తిపోయింది. ఎంతగా అంటే అంబులెన్సు సైరన్ కూడా వినపడనంతగా. ఓ అభాగ్యుడి ప్రాణం గాల్లో కలిసిపోతున్నా కూడా పట్టనంతగా. ఈ ఆరోపణలు ఎదుర్కుంటోంది మరెవరో కాదు.. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఓ వ్యక్తి మరణానికి ఎమ్మెల్యేనే కారణం అంటూ విమర్శలు గుప్పు మన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడి హోదాలో తొలిసారి జిల్లాకు వెళ్లారు. ఆయనకు అట్టహాసంగా ఆహ్వానం పలికే క్రమంలో పదుల సంఖ్యలో వాహనాలతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీ వల్ల ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్ లో ఓ అంబులెన్సు ఇరుక్కు పోయింది. అందులో చండ్రుగొండ మండలం పోకలగూడెం బాల్య తండాకు చెందిన భూక్యా రాంచందర్ అనే వ్యక్తి ఉన్నాడు. రాంచందర్ హైబీపీతో ఒక్కసారిగా కూలిపోయాడు. అతడిని కొత్తగూడెం నుంచి ఖమ్మానికి వెంటిలేటర్ అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ అంబులెన్సు ట్రాఫిక్ లో నిలిచిపోయింది. ఎమ్మెల్యే కాన్వాయ్, మద్దతుదారుల వాహనాల కారణంగానే అంబులెన్సుకు దారి దొరకలేదని.. రాంచందర్ ప్రాణాలు కోల్పోయాడంటూ బంధువులు, మిత్రులు ఆరోపిస్తున్నారు. కనీసం పోలీసులన్నా స్పందించి దారి క్లియర్ చేయాల్సిందని మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై అటు పోలీసులు గానీ, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు గానీ, ఎవరూ స్పందించలేదు. అసలు ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంతుంది? అనేది వారు స్పందిస్తేగానీ ఓ కొలిక్కి రాదు.