టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ విషయంలో తెలంగాణ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో బీజేపీ కార్యకర్త హస్తం ఉందని వెల్లడించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆదేశాలతో సమీక్ష చేయడం జరిగిందని, సమీక్షలో నిపుణులతో చర్చించినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. టీఎస్పీఎస్సీలో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలనే కాదు.. వీరి వెనుక ఎవరున్నా నిష్పక్షపాతంగా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ యువత ఈ విషయంలో చింతించాల్సిన పని లేదని అన్నారు. ఇది వ్యవస్థ తప్పు కాదని, ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని అన్నారు. వీరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని అన్నారు.
వ్యక్తుల వల్ల పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే అంశం మీద సమీక్ష చేశామని అన్నారు. దీనిని కొందరు చిలవలు, పలవలు చేసి చూపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాజశేఖర్ రెడ్డి బీజీపీ పార్టీ క్రియాశీలక సభ్యుడని, దీని వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానం ఉందని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ నిరుద్యోగులే దీన్ని వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ద్వారా 155 నోటిఫికేషన్లు ఇచ్చామని, 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన చరిత్ర టీఎస్పీఎస్సీదని అన్నారు.
37 వేల ఉద్యోగాలు కమిషన్ ద్వారా భర్తీ చేసినట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత ఉందని అన్నారు. రద్దు అయిన పరీక్షలకు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో పరీక్షలకు హాజరైన వాళ్ళను అర్హులుగా గుర్తిస్తామని, అభ్యర్థులకు కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. స్టడీ సర్కిల్స్ ని బలోపేతం చేస్తామని, ఉచిత భోజనం, మెటీరియల్ స్టడీ సర్కిల్స్ లో ఉంటాయని అన్నారు. 24 గంటలు స్టడీ సర్కిల్స్ పని చేస్తాయని అన్నారు.