ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా కదులుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేస్తున్నామని డీహెచ్ స్పష్టం చేశారు. అయితే ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కొన్ని దేశాల్లో నమోదవుతున్నాయని దీనిపై ప్రజలు అప్రమత్తమవ్వాలని కోరాడు.
విదేశాల నుంచి వచ్చిన 900 మందికి ఎయిర్ పోర్టులో చేసిన టెస్టుల్లో ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయని, అది ఓమిక్రాన్ వేరియంట్ అని చెప్పలేమని దీనిపై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత రానుందని తెలిపారు. ఇక రానున్న రోజుల్లో లాక్ పెట్టే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిన నమ్మొద్దని అన్నారు. దీంతో పాటు ముందున్న ఆరు వారాలు మరింత కీలకమని, ఫిబ్రవరి నాటికి కేసులు పతాకస్థాయికి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని డీహెచ్ కోరారు.