ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా కరోనా అతివేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకి కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటం జనాల్లో ఆందోళన కలిగిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా మన దేశంలో 94 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరుకుంది.
ఇప్పటివరకు 560 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు సమాచారం. అయితే.. అత్యధికంగా మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 67 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాలలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాపించింది.ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 27,553 మంది కరోనా బారిన పడ్డట్లు వైద్యశాఖ తెలిపింది. ముందురోజుతో పోలిస్తే కొత్తగా 21శాతం కేసులు పెరిగినట్లు చెబుతున్నారు. అదీగాక ఒక్క రోజులోనే సుమారు 284 మంది మృత్యువాత పడటం బాధాకరం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,89,132కి చేరగా.. 4,81,770 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,22,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరి ఇంత జాగ్రత్త పడుతున్నా కేసులు పెరగటం, ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే జనాలు భయంతో వణుకుతున్నారు.