అవయవదానం గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా ఆర్గాన్ డోనేషన్ కి ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పటికీ గుండె కానీ, కిడ్నీ కానీ మార్చాలంటే.. సదరు బాధితులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పోనీ ఆస్తులు అమ్ముకుంటామన్నా.. అవి దొరికే పరిస్థితులు చాలా అరుదు. దీంతో అవయవాలు దొరక్క, ఆపరేషన్ చేయించుకోలేక అనేక మంది చనిపోయిన వారున్నారు. వారిలో ఒకరు నటి మీనా భర్త విద్యాసాగర్. ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు ప్రయత్నించినా ఆర్గాన్ డోనర్ దొరక్క మృతి చెందిన సంగతి విదితమే.
కానీ ఓ మహిళ చనిపోతూ కూడా ముగ్గురికి ప్రాణం పోసింది. ఆమె గుండె ఓ చిన్నారిని ఊపిరినందిస్తే..కిడ్నీ, కళ్లు మరో ఇద్దరికి జీవం పోశాయి. వివరాల్లోకి వెళితే విశాఖకు చెందిన భెల్ ఉద్యోగి ఆనందరావు భార్య సన్యాసమ్మ ఈ నెల 16న కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోవడంతో.. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. మూడు రోజులైనా కోమాలో నుండి కోలుకోకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఆ త్వరాత వైద్యులు, జీవన్ దాస్ సిబ్బంది ఆనందరావు కుటుంబ సభ్యులతో చర్చించగా.. అవయవదానానికి వారు అంగీకరించారు.
ఆనందరావు, ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో సన్యాసమ్మ శరీరం నుండి గుండె, కిడ్నీ, కళ్లు వేరు చేశారు. గుండెను తిరుపతిలోని ఓ చిన్నారికి అందించాలని జీవన్ దాస్ సిబ్బంది భావించారు. వెంటనే విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సహాయంతో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తరలించారు. అక్కడి నుండి తిరుపతిలోని ఆసుప్రతికి పంపారు. సన్యాసమ్మకిడ్నీలను చెన్నైకి తరలించారు. కళ్లను విశాఖలోనే మరొకరి అందించారు. అవయవదానానికి ముందుకు వచ్చిన ఆనందరావు కుటుంబ సభ్యులను వైద్యలు, జీవన్ దాస్ సిబ్బంది అభినందించారు.