హైదరాబాద్ లోని జెఎన్ టియులో విద్యార్థిని మృతి మర్చిపోక ముందే.. మరో యూనివర్శిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ)లో చదువుతున్న అంజలి అనే విద్యార్థిని హాస్టల్ బిల్లింగ్ పై నుండి దూకి చనిపోయింది. ఈ మృతి వార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇప్లూ వద్దకు చేరుకుని, దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజలి స్వస్థలం హర్యానా. ఇఫ్లూ క్యాంపస్ లో ఎంఎ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శనివారం ఉదయం యూనివర్శిటీలోని ఓ భవనం నాల్గవ అంతస్తు నుండి దూకి ప్రాణాలు పోగొట్టకుంది. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలతోనే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం ఆమె ప్రమాదవశాత్తూ మృతి చెంది ఉంటుందని అంటున్నారు. సరైన రక్షణ చర్యలు, గ్రీల్స్ లేకపోవడంతో.. అంజలి కింద పడి చనిపోయినట్లు చెబుతున్నారు. ఓయూలో వరుసగా మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
యూనివర్శిటీలో డ్రగ్, మందు కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని, ర్యాగింగ్ జరుగుతుందన్నారు. గత నెలలో ఇద్దరు బెంగాలీ అమ్మాయిలు తప్పతాగి, ఓ యువతిపై దాడి చేశారన్నారు. క్యాంపస్ లో దారుణం జరుగుతున్నా వర్శిటీ సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇఫ్లూ వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.