హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. మొదట 723 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. తొలి రౌండ్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. మొత్తం 22 రౌండ్‌లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్‌లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యం కనబరిచింది బీజేపీ. రెండవ రౌండ్ లో 193 ఓట్ల ఆధిక్యం సాధించినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లోకూడా టీఆర్ఎస్ కి ఇండిపెండెంట్స్ వల్ల మరోసారి ఇబ్బంది ఎదురైనట్లు స్పష్టమవుతోంది. కారు గుర్తును పోలిన రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు కేటాయించింది ఈసీ. ఇప్పటికే ఈ గుర్తు కారును పోలి ఉందని మంత్రి హరీష్ రావు ప్రచారంలో చెప్పుకొచ్చారు. అంతే కాదు టీఆర్ఎస్ ముఖ్య నేతలు దీనిపై ప్రత్యేకంగా డమ్మీ ఈవీఎం లు తీసుకు వెళ్లి మరీ ఓటర్లకు ప్రచారం చేశారు.ఈ క్రమంలో శ్రీకాంత్ కు 122 ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ కంటే ఈ గుర్తుకే ఎక్కువ ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఫస్ట్ రౌండ్‌లోనే ఇన్ని ఓట్లు పోలయ్యాయి. అన్ని రౌండ్స్ ముగిసేసరికి ఈ గుర్తుకు పోలయిన ఓట్ల సంఖ్య ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం హుజూరాబాద్ కొనసాగుతున్న కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.