ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు చేసే ప్రయత్నాలు చూస్తే.. వార్ని ఈ తెలివితేటలను జీవితంలో ఎదగడానికి వాడితే ఎంత బాగుటుందో కదా అనిపిస్తుంది. కొందరు నంబర్ ప్లేట్ పై ఒకటి, రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిచడం, ఇక బండి మీద కూర్చున్న మహిళలు.. తమ వస్త్రాలతో దాన్ని కప్పేయడం చేస్తుంటారు. తాజాగా వీరిని తలదన్నే రీతిలో మరో కొత్త రకం ఎత్తుగడ ప్రయత్నిస్తున్నారు వాహనదారులు. కరోనా కట్టడి కోసం మూతికి పెట్టకుకోవాల్సిన మాస్క్ ను ఏకంగా చలాన్ల నుంచి తప్పించుకోవడం కోసం నంబర్ ప్లేట్ కు తగిలించి.. బిందాస్ గా రోడ్ల మీద షికారు చేస్తున్నారు. మెయిన్ రోడ్ల మీద కూడా ఇలా నంబర్ ప్లేట్ కనపడకుండా మాస్క్ వేసి తిరుగుతున్న వారి ధైర్యానికి ఆశ్చర్యపోవడం ట్రాఫిక్ పోలీసులు వంతవుతుంది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఎందుకు కఠినంగా శిక్షించడం లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు జనాలు. జాతీయ రహదారిపై కూడా ఇలా నంబర్ ప్లేట్ లేని వాహనాలు రోజు వందల సంఖ్యలో ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి.
రాంగ్ రూట్, త్రిబుల్ రైడింగ్, సిగ్నల్ జంప్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మాస్క్ లేకుండా ప్రయాణాలు కొనసాగించడం ప్రస్తుతం సర్వసాధారణం అయ్యాయి. ఇలా ఉల్లంఘనలకు పాల్పడటాన్ని యువత ట్రెండ్ గా ఫాలో అవుతున్నారు. చదువుకోని వారి కన్నా.. చదువుకున్న వారే ఇలాంటి ఉల్లంఘనలకు ఎక్కువగా పాల్పడుతుండటం గమనార్హం. వీరు తమ సరదా కోసం ట్రాఫిక్ రూల్స్ ని పెడచెవిన పెడుతుండటంతో అభంశుభం తెలియని అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని.. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.