ఈ మద్య కాలంలో వీధుల్లో ఒంటరిగా నడవాలంటే భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఎక్కడ నుంచి కుక్కలు దాడులు చేస్తాయో అని భయపడుతున్నారు. వీధి కుక్కల దాడుల్లో ఎంతో మంది గాయాలు కావడమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
ఇటీవల వీధికుక్కల దాడిలో చిన్నారు ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ విషాద ఘటన హైదరాబాద్ అంబర్ పేటలో చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అంబర్ పేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ కుక్కల దాడిలో చనిపోవడం ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా కుక్కలు తిరుగుతున్నాయో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 5 లక్షల 70 వేల కుక్కలు ఉన్నాయని.. వాటిలో ఇప్పటి వరకు 4 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామని అన్నారు.
నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు ప్రతిరోజూ దాదాపు 30 వాహనాల వరకు తిరుగుతున్నాయని.. కొన్ని కుక్కలు స్టెరిలైజ్ చేసినప్పటికీ కరుస్తున్నాయని ఆమె అన్నారు. వీధి కుక్కలను ప్రజలు అడాప్ట్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కుక్కలపై చర్యలు తీసుకోవడానికి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని.. ఇక నుంచి కొన్ని సర్కిళ్లను ఎంపిక చేసి కుక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఆమె అన్నారు. ఏది ఏమైనా అంబర్ పేటకు చెందిన బాలుడు కుక్కల దాడిలో చనిపోవడం ఎంతో విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.