ఓ డెలివరీ బాయ్ పరుపు డెలివరీ చేయడానికని ఓ ఫ్లాట్ కి వెళ్ళాడు. అయితే అక్కడ కుక్క ఇతన్ని చూసి మీదకు దూకడంతో అతను భయంతో మూడవ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందంటే?
హైదరాబాద్ లో కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా మీద పడి దాడి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో అనేక మంది చిన్నారులు మృతి చెందారు. మహబూబాబాద్ లోని అనేపురంలో 15 మందిపై కుక్కలు దాడి చేశాయి. పలువురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. బహిర్భూమికి వెళ్లిన 8 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కల వల్ల కూడా ప్రమాదం ఉంటుందని పలు సంఘటనలు రుజువు చేశాయి. ఆ మధ్య స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరు ఓ కస్టమర్ కి ఆర్డర్ డెలివరీ చేయడానికని వెళ్తే.. అతనిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఆ యువకుడు మరణించాడు.
తాజాగా మరో పెంపుడు కుక్క డెలివరీ బాయ్ పై దూసుకొచ్చింది. దీంతో ఆ యువకుడు భయంతో మూడవ అంతస్తు నుంచి దూకేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ ఇలియాజ్ అనే యువకుడు అమెజాన్ డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. మణికొండలోని పంచవటి కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో కస్టమర్ కి పరుపు డెలివరీ చేద్దామని వెళ్ళాడు. అయితే ఆ ఫ్లాట్ లో డాబర్ మేన్ జాతికి చెందిన పెంపుడు కుక్క కట్లు విప్పేసి ఉండడం, తలుపు తీసి ఉండడంతో డోర్ వద్దనే నిలబడ్డ యువకుడి మీద కుక్క దాడి చేసేందుకు యత్నించింది. అతని మీదకు ఒక్కసారిగా దూకడంతో భయంతో ఇలియాజ్ మూడవ అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని పరిస్థితి బానే ఉందనికే, ఎటువంటి అపాయం లేదని అంటున్నారు. ఈ ఘటనపై బాధితుడు కేసు పెడితే కుక్క యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జనవరి నెలలో ఇలానే ఓ పెంపుడు కుక్క.. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన 23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ పై దాడి చేసింది. ఫుడ్ డెలివరీ చేయడానికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6లోని లుంబినీ రాక్ కాసిల్ అపార్ట్మెంట్ కు వెళ్లిన రిజ్వాన్ మీద కుక్క దాడి చేసే సరికి ప్రాణాలు కాపాడుకోవడం కోసం మూడవ అంతస్తు నుంచి దూకేశాడు. తలకు, శరీరం మీద పలు చోట్ల తీవ్ర గాయాలు కావడంతో ఫ్లాట్ యజమాని అంబులెన్స్ కు కాల్ చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజులు కోమాలో ఉన్న రిజ్వాన్.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరో యువకుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. అయితే డెలివరీ బాయ్ తాను వస్తున్నానని కాల్ చేసినప్పుడు ఓనర్ కుక్కను కట్టి ఉంచాలని.. యజమానిదే తప్పు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఓనర్ తమ తప్పు ఏమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారు. కుక్కలు అరుస్తాయి తప్ప హాని చేయవని అంటున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.