ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై ఆమె స్పందించారు. ఈడీ ముందు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కవితకు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్నట్లు ఈడీ అధికారులు గతంలోనే రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు చేర్చారు. విచారణకు హజరు కావలంటూ నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా మహిళా దినోత్సవం రోజునే కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 9 అనగా గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు కవిత ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తల వంచదు పేరిట ఓ నోట్‌ను పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ..‘‘ మహిళల రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నాము. ఈ ధర్నాలో ప్రతిపక్ష పార్టీలు, మహిళా ఆర్గనైజేషన్స్ పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 9న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు పంపింది.
దీనిపై నా స్టేట్‌మెంట్.. ‘‘ చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను విచారణా సంస్థకు పూర్తిగా సహకరిస్తాను. కానీ, ధర్నాతో పాటు ముందుగా అనుకున్న కార్యక్రమాల దృష్ట్యా.. విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని బెదిరించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మేము వాటికి తలొగ్గము. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇలాంటి ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. మీ ముందు ఎప్పటికీ తలవంచము. ప్రజల హక్కుల కోసం పోరాడటానికి ఏ మాత్రం భయపడము’’ అని అన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. మరికొందరిని విచారిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని మార్చి 7న అరెస్ట్ చేశారు. ఇతడ్ని ఈడీ విచారించగా తాను కవిత బినామినని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కవితకు నోటీసులు పంపారు. ఈడీ అధికారుల విచారణలో కవితకు ఈ కేసుతో సంబంధం ఉందని తేలినా.. పిళ్లై కవితకు బినామి అని తేలినా ఆమె అరెస్ట్ తప్పదని న్యాయ శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి, మహిళల దినోత్సవం నాడు కవితకు ఈడీ నోటీసులు పంపటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.