ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ నుండి తెలంగాణ, ఏపీతో లింకులున్న ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం రోజుకో మలుపు తీసుకుంది. ఢిల్లీ టూ హైదరాబాద్‌తో లింకులున్న ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రఘులను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై చార్జీషీటు దాఖలైంది. ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారణకు పిలిచింది ఈడీ. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణలో భాగంగా.. ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని సీబీఐ అరెస్టు చేసి విచారించింది. వారి రిమాండ్ రిపోర్టులో కేజ్రీవాల్ పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖ రాయడంతో.. కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా సిసోడియా పేరును చేర్చింది. తాజాగా కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది.