దేశమంతా రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. ఒకరు జవాన్, మరొకరు కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయకపోతే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. పొలంలో రైతు అన్నం మెతుకు పండించకపోతే ప్రాణాలు నిలబడవు. దేశంలో ఈ దేహం ప్రాణంతో నిలబడాలంటే ఈ ఇద్దరూ ఉండాల్సిందే. ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ సేవలు అందించేది ఈ ఇద్దరే. గ్రామంలో ఉండేవారు ఎక్కువగా రైతులకు, సైనికులకు ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ విషయంలో ఇదే జరిగింది. దేశానికి విశిష్టమైన సేవలను అందించి.. ఉద్యోగ విరమణ పొంది వచ్చిన సైనికుడికి ఆ ఊరి ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. 20 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించిన లక్క లింగారెడ్డి.. ఉద్యోగ విరమణ పొంది సొంత ఊరు వెళ్లారు. ఈ క్రమంలో ఊళ్ళో అందరూ ఉత్సాహంగా ఆ సైనికుడ్ని ఆహ్వానించారు.
ఈ అద్భుతమైన ఘటన నల్గొండ జిల్లా బట్టుగుడెం గ్రామంలో చోటు చేసుకుంది. సైనికుడు ఊర్లో ల్యాండ్ అవ్వగానే గ్రామస్తులంతా బ్యాండ్ మేళాలతో ఆహ్వానం పలికి ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. దేశభక్తి గీతాలతో, నృత్యాలతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ సైనికుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సన్మానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామస్తులు ఆర్మీ జవాన్ కి పలికిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్మీ జవాన్ కి ఘన స్వాగతం పలకడం, ఈ విధంగా గౌరవం ఇవ్వడంతో ఆ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆర్మీ జవాన్ తమ ఊరికి తిరిగి రావడాన్ని వేడుకలా చేసుకున్న బట్టుగుడెం గ్రామస్తులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.