సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చిన తర్వాత ఇంటి వద్ద ఆటల్లో మునిగిపోతుంటారు పిల్లలు. ఇక స్కూళ్లు మళ్లీ తెరిచారని తెలియగానే ఒకింత నీరుగారిపోతారు. అబ్బా మళ్లీ స్కూల్ కి వెళ్లాలా అన్న బాధలో ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు స్కూల్ తెరిచిన మొదటి రోజు హ్యాపీగా వెళ్తే.. మరికొంతమంది పిల్లలు తెగ మారాం చేస్తూ ఉంటారు. ఇక పిల్లలను స్కూల్ కి పంపడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె కొడుకు స్కూల్ గది వరకు వచ్చి లోపలికి వెళ్లెందుకు మారాం చేయడంతో బుజ్జగించి మరీ స్కూల్ టీచర్ కి అప్పగించారు. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన కుమారుడు సారంగ్ ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఉన్నతాధికారి అయి ఉండి ఆమె కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడపై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తన కుమారుడు సారంగ్ ని స్కూల్ కి తీసుకు వచ్చి తరగతి గదిలో పంపించేందుకు ప్రయత్నించారు.. కానీ సారంగ్ మాత్రం తరగతి గదిలోకి వెళ్లెందుకు మారాం చేశాడు. ఇక ఆమె తనయుడిని బుజ్జగించడానికి కలెక్టర్‌కు చాలా సమయమే పట్టింది. టీచర్లు అంతా బాలుడితో మాట్లాడి, ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఎట్టకేలకు లోపల కూర్చొబెట్టారు.
జిల్లాకు కలెక్టర్ అయినా ఓ బిడ్డకు మాత్రం తల్లే కదా.. కొడుకు మారం చేస్తే అందరు తల్లుల్లాగే ఆమె కూడా కొడుకుని బుజ్జగించి తరగతి గదిలోకి పంపించింది. అయితే సిక్తా పట్నాయక్ కలెక్టర్ స్థాయిలో ఉన్నా కూడా ఎలాంటి హంగు ఆర్భాటం ప్రదర్శించరని అంటుంటారు. స్కూల్లో జరిగిన సంఘటన అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.