హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. గత వారం ఒకే రోజు పలు చోట్ల దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో నగర వాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇవన్నీ దొంగల పనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కానీ పోలీసు అకాడమీలో చేతి వాటాన్ని ప్రదర్శించిన వ్యక్తి గురించి తెలుసుకుని అవాక్కవ్వడం వాళ్లవంతైంది.
వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్ లోని పోలీసు అకాడమీలో ఇటీవల వరుసగా కంప్యూటర్లు మాయమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ అకాడమీలో ఉన్న ఒక్కొక్కటిగా కంప్యూటర్లు కనిపించకుండా పోయాయి. సుమారు 7 కంప్యూటర్లు చోరీకి గురికావడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగలెవరన్నదీ తెలుసుకునేందుకు అక్కడే ఉన్న సీసీటివి ఫుటేజ్ ను పరిశీలించడంతో ఆ దొంగ ఎవరన్నదీ చిక్కుముడి వీడింది.
ఆ ఇంటి దొంగ పేరు చంద్ర శేఖర్. అకాడమీలోని ఐటి సెక్షన్ లో పనిచేస్తున్నాడు. పోలీసులు సీసీటివిని పరిశీలించిగా.. చంద్రశేఖర్ కంప్యూటర్లను దొంగిలించినట్లు కనిపించింది. దీంతో ఎన్పీఎ అధికారులు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సామాన్యుల ఇళ్లకే భద్రత కొరవడింది అనుకుంటే.. ఏకంగా పోలీసు అకాడమీలో దొంగతనాలు జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.