మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ బ్రౌజర్ సెక్యూరిటీ సిస్టమ్‌లో లోపాలు ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తూ కేంద్ర ఏజెన్సీ సంస్థ సీఈఆర్‌టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఏముందంటే..!
ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం వాడే బ్రౌజర్లలో మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఒకటి. చాలామంది యూజర్లు ఈ బ్రౌజర్‌ను వాడుతుంటారు. అలాంటి ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మొజిల్లా బ్రౌజర్‌లో లోపాలు ఉన్నాయని కేంద్ర సర్కారు ఏజెన్సీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ టీమ్ ఆఫ్ ఇండియా (సర్ట్-ఇన్) ఒక ప్రకటన విడుదల చేసింది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని ఈ ప్రకటనలో కేంద్రం తెలిపింది. అది బ్రౌజర్ సెక్యూరిటీని ఏమార్చి.. యూజర్ డేటాను హ్యాకర్స్‌కు చేరవేస్తాయని చెప్పుకొచ్చింది. ఫైర్‌ఫాక్స్‌లో ఉన్న లోపాల వల్ల టార్గెట్ చేసిన కంప్యూటర్లలో ఆర్బిట్రరీ కోడ్ ఎక్జిక్యూషన్ చేసేందుకు రిమోట్ అటాకర్స్‌కు వీలు పడుతోందని సీఈఆర్‌టీ తెలిపింది.
మొజిలా ఫైర్‌ఫాక్స్ వెర్షన్ 30కి దిగువన ఉన్న ఆండ్రాయిడ్ ఏపీఐపో వినియోగించినప్పుడు ఆడియో మ్యానిపులేషన్ జరిగే చాన్సులు ఎక్కువగా ఉంటాయని సీఈఆర్‌టీ పేర్కొంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్ 110.1.0 హై రిస్క్‌లో ఉన్నట్లు సీఈఆర్‌టీ వ్యాఖ్యానించింది. అలాగే ఆండ్రాయిడ్ బ్రౌజర్ వెర్షన్‌లోనూ ఈ సెక్యూరిటీ పరమైన లోపాలను గుర్తించినట్లు తెలియజేసింది. మిగిలిన ఫైర్‌ఫాక్స్ వెర్షన్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది. యూజర్లకు నకిలీ వెబ్ లింకులు పంపి.. వాటిపై క్లిక్ చేసిన వెంటనే మొజిల్లా బ్రౌజర్స్‌లోని సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏమార్చి డేటాను సేకరిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లు వెర్షన్ 110.1.0 వాడుతుంటే గనుక వెంటనే కొత్త సెక్యూర్డ్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్‌టీ యూజర్లకు సూచించింది.