వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు.. అందులో తప్పులు గానీ అక్షర దోషాలు గానీ ఉంటె సరిచేసుకునే ఫీచర్ ఉంటే బాగుణ్ణు అని మీరు అనుకుంటున్నారా? అయితే వాట్సాప్ ఈ మెసేజ్ ఎడిట్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్ చాట్ లో గానీ గ్రూప్ లో గానీ మెసేజ్ పంపించిన తర్వాత దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుణ్ణు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఈ వాట్సాపోడికి ఈ ఫీచర్ ని తీసుకురారా అని చెప్పాలని అనిపించిందా? వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు టైప్ చేస్తుంటే అక్షర దోషాలు పడతాయి. అవి చూసుకోకుండా పుసుక్కున సెండ్ బటన్ మీద క్లిక్ చేసి పంపించేస్తాం. ఆ తర్వాత చూసుకుని అరెరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని డిలీట్ చేయడమో.. దాని తర్వాత సరిచేసి వేరే మెసేజ్ రాసి పంపడమో చేస్తాం. అదే మెసేజు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే.. మళ్ళీ టైప్ చేయడం కష్టం కదా. కాపీ చేసి దాన్నే సరిచేసి పంపుతాం. ఇంత ప్రాసెస్ అవసరమా.. అదే మెసేజ్ ని ఎడిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదూ.
అయితే పంపిన మెసేజునే ఎడిట్ చేసే ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది పొరపాటున ఈ బూతు మాటో పంపినా, తప్పుగా మెసేజ్ పంపినా ఎడిట్ చేసుకునే వీలు కల్పించాడు వాట్సాపోడు. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ని సైలెన్స్ చేయడం, గ్రూప్ చాట్ లో మెసేజులు కరెక్ట్ గా లేకపోతే రిపోర్ట్ కొట్టే ఆప్షన్ ఇవ్వడం వంటి ఫీచర్స్ ని పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరొక ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ ని పంపితే.. ఏమైనా అక్షర దోషాలు ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే ఫీచర్ ని తీసుకొస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో డెవలపర్లు ఈ ఫీచర్ ను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపించిన 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే విధంగా సరికొత్త ఫీచర్ ను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాట్సాప్ బేటా వెర్షన్ లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేసినట్లు ‘వాట్సాప్ బేటా ఇన్ఫో’ అనే వెబ్ సైట్ వెల్లడించింది. వాట్సాప్ వెబ్ బేటా వెర్షన్ ఈ ఫీచర్ ను పొందిన కొన్ని రోజులకే కొంతమంది వినియోగదారులు వాట్సాప్ బేటా ఆండ్రాయిడ్ 2.23.10.13 వెర్షన్స్ లో చాట్స్ మరియు గ్రూప్స్ లో పంపిన సందేశాలను ఎడిట్ చేయగలుగుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వెబ్ సైట్ లో ఉంది. ఈ స్క్రీన్ షాట్ ని గమనిస్తే.. పంపిన మెసేజ్ ని సెలెక్ట్ చేస్తే.. కుడి వైపున పైన ఇన్ఫో, కాపీ, ఎడిట్ అనే ఆప్షన్స్ కనబడతాయి. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మెసేజ్ ని ఎడిట్ చేయవచ్చు.
అయితే ఎన్నిసార్లు అయినా సందేశాన్ని సవరించుకోవచ్చు.. కానీ ఎన్ని సార్లు చేసినా 15 నిమిషాల లోపే చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ అందుకు అనుమతించదు. టైపింగ్ మిస్టేక్స్, అక్షర దోషాలు ఉంటే సవరించుకునేలా ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బేటా టెస్టింగ్ లో ఉంది. కొంతమంది బేటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కేవలం మెసేజులను మాత్రమే ఎడిట్ చేసుకునేలా ఫీచర్ ని రూపొందించింది. భవిష్యత్తులో ఈ ఫీచర్ ను మరింత అప్ డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎడిట్ ఫీచర్ ను అందరి యూజర్లకు అందుబాటులోకి ఎప్పుడు తీసుకొస్తుందో అనే విషయాన్ని చెప్పలేదు. అయితే ఆండ్రాయిడ్ వాట్సాప్ బేటా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ డివైజ్ లో ఈ ఎడిట్ ఫీచర్ కనబడుతుందో లేదో అనేది తెలుస్తుంది.
ఆండ్రాయిడ్ వాట్సాప్ బేటా 2.23.10.10 అప్డేట్ లో మెసేజ్ ఎడిటింగ్ కి సంబంధించి సమాచారం ఉంటుంది. ఇందులో మీరు ఎడిట్ చేసిన సందేశాలు చాట్ లేదా గ్రూప్ లో ఉన్న వారందరికీ విజయవంతంగా అప్డేట్ చేయబడుతుంది. అది కూడా వారు లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్ వాడితేనే ఎడిట్ చేసిన మెసేజ్ అనేది అప్డేట్ అవుతుంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బేటా 2.23.10.13 అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత బేటా టెస్టర్లు మెసేజ్ పంపిన 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే ఫీచర్ కనబడుతుంది. టెస్ట్ ఫ్లైట్ యాప్ మీద ఐఓఎస్ 23.10.0.70 అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన టెస్టర్లకు కూడా ఈ ఎడిట్ ఫీచర్ అప్డేట్ కనబడింది. ఈ అప్ డేట్ లో అపరిచితుల కాల్స్ ని సైలెంట్ లో పెట్టడం, కమ్యూనిటీ అనౌన్స్ మెంట్స్ గ్రూప్ కోసం ఇంప్రూవ్మెంట్స్ వంటి కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ అనేది అందరినీ ఆకర్షిస్తోంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి ఈ మెసేజ్ ఎడిట్ ఫీచర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.