టెక్నాలజీ రంగంలో యాపిల్ సంస్థ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు యాపిల్ తీసుకొచ్చిన దాదాపు ప్రతి ప్రాడక్ట్ సూపర్ హిట్టయ్యిందనే చెప్పాలి. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ లాంటి అంశాలకు పెద్దపీట వేసే యాపిల్.. అధునాతన ఫీచర్లను ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతర పోటీ కంపెనీలను వెనక్కినెడుతూ వస్తోంది. క్వాలిటీ పరంగా మిగతా బ్రాండ్ల డివైజ్‌లతో పోల్చుకుంటే యాపిల్ ఉత్పత్తులు చాలా బాగుంటాయనే పేరుంది. అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా మధ్యతరగతి వర్గం మాత్రం ఈ బ్రాండ్‌కు కాస్త దూరంగానే ఉంటారు. క్వాలిటీ పరంగా నంబర్ వన్ అయిన యాపిల్ బ్రాండ్ ప్రాడక్ట్‌లు.. అంతే కాస్ట్‌లీ అనేది అందరికీ తెలిసిందే.
యాపిల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. చివరికి ఆ సంస్థ తయారు చేసిన ఎయిప్‌పాడ్స్ కొనాలన్నా కనీసం రూ.15 వేలు వెచ్చించాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యాపిల్ ఎయిర్‌పాడ్స్ జనరేషన్ 2 ధర రూ.14,900గా ఉంది. యాపిల్ ఎయిర్‌పాడ్స్‌లో ఇదే అతి తక్కువ ధరకు లభిస్తున్న ప్రాడక్ట్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టే ఆ కంపెనీ ఉత్పత్తులు ఎంత ప్రియమో అర్థం చేసుకోవచ్చు. అందుకే తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావాలని యాపిల్ యోచిస్తోందట. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
యాపిల్ తీసుకురానున్న కొత్త ఎయిర్‌పాడ్స్ ధర భారత్‌లో సుమారుగా రూ.8,000 ఉండొచ్చని సమాచారం. దీంతోపాటు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ పేరిట మరో హై ఎండ్ వేరియంట్‌ను కూడా త్వరగా తీసుకొచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని వినికిడి. అయితే, బడ్జెట్‌లో వచ్చే ఎయిర్‌పాడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండకపోవచ్చునని అనలిస్టులు చెబుతున్నారు. అతి తక్కువ ధరకు ఎయిర్‌పాడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న యాపిల్.. తద్వారా ఆడియో మార్కెట్‌లోనూ సేల్స్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ రూ.8 వేల ధరలో ఎయిర్‌పాడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తే మాత్రం భారత్‌లో యాపిల్ సేల్స్ పెరిగే చాన్స్ ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇంతకంటే తక్కువ ధరకే మిగతా కంపెనీలు ఎయిర్‌పాడ్స్‌ను మరెన్నో సదుపాయాలతో అందిస్తున్నాయి. వాటి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని సేల్స్‌ను పెంచుకోవాలని యాపిల్ భావిస్తోంది. మరి, యాపిల్ సంస్థ వినియోగదారుల కోసం ఎయిర్‌పాడ్స్‌ను తక్కువ ధరకే అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.