చాట్ జీపీటీ విషయంలో ఇప్పటికే ఎంతోమంది టెక్ దిగ్గజాలు, దిగ్గజ కంపెనీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. అయితే వీరిలో చాలా మంది చాట్ జీపీటీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాట్ జీపీటీతో మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా చాట్ జీపీటీ విషయంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందించారు.
చాట్ జీపీటీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్టీఫీషియల్ చాట్ బాట్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాట్ జీపీటీ చేయలేని పని లేదంటూ ఎంతో మంది చెప్పుకొచ్చారు. చాట్ జీపీటీని తెగ పొగిడేశారు. మొదట్లో అంటే ఇది చేసే అద్భుతాల గురించి మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం చాట్ జీపీటీ వల్ల తమ ఉద్యోగాలు ఊడతాయని, మనిషి జీవనానికి, ఉనికి ముప్పు ఉంటుందంటూ ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వాదనలు, అపోహలు, భయాల విషయంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ చాట్ బాట్ కూడా మనిషి మేధస్సుకు సాటి కాదంటూ ఒక్క మాటతో తేల్చేశారు.
ఓపెన్ ఏఐ సంస్థ తయారు చేసిన చాట్ జీపీటీకి ఓవర్ నైట్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం రెండు నెలల వ్యవధిలో 100 మిలియన్ల యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుని అందరి చూపుని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత అది ఏది చేసినా అద్భుతమే అయ్యింది. ఈ చాట్ జీపీటీ విషయంలో చాలా మందిలో భయాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలపై నారాయణ మూర్తి స్పందించారు. “ఏదైనా సమాచారాన్ని సేకరించేందుకు ఈ చాట్ జీపీటీ సహకరిస్తుంది. కానీ, మనిషులతో పోటీ పడాలి అంటే అది చాట్ జీపీటీతో సాధ్యం కాదు.
మనిషి మెదడుని మించిన యంత్రం మరొకటి లేదు. ఆ విషయాన్ని గట్టిగా నమ్మేవారిలో నేను కూడా ఒకడిని. ఏ యంత్రమైనా మనిషి నుంచే పుట్టుకొస్తుంది. అది కూడా మనిషికి ఒక సాధనంగా మాత్రమే పనికొస్తుంది. ఉదాహరణకు.. మీరు ఒక ప్రశ్నను ఇద్దరు వ్యక్తులను అడిగితే వారి భిన్నమైన సమాధానాలు చెబుతారు. కానీ, ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రశ్నను చాట్ జీపీటీని అడిగితే అది ఒక రకమైన సమాధానం చెబుతుంది. చాట్ జీపీటీ వంటి చాట్ బాట్ ల వల్ల సృజనాత్మకత దెబ్బతింటుంది. చాట్ జీపీటీ విషయంలో మనుషులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అంటూ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అయితే చాట్ జీపీటీతో మానవాళికి ముప్పు తప్పదంటూ ఇప్పటికే ఎంతో మంది టెక్నాలజీ నిపుణులు హెచ్చిరించారు.