గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్ నిపుణులు, వినియోగదారులు నుంచి కంటే సొంత ఉద్యోగుల నుంచే ఇప్పుడు సుందర్ పిచాయ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, చాట్ జీపీటీ అనే మాట్లాడుకుంటున్నారు. ఈ చాట్ జీపీటీతో గూగుల్ కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అయితే దాని స్థానాన్ని కాపాడుకోవడానికి చాట్ జీపీటీకి పోటీగా సుందర్ పిచాయ్ గూగుల్ బార్డ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ గూగుల్ బార్డ్.. తమ పేరెంటింగ్ సంస్థ ఆల్ఫాబెట్ కొంప ముంచింది. దానివల్ల ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఈ విషయంలో ఇప్పుడు అందరి వేళ్లు సుందర్ పిచాయ్ వైపే చూపిస్తున్నాయి. గూగుల్ సీఈవో చేసిన తప్పు వల్లే ఇంతటి నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు.
లేఆఫ్స్ ప్రారంభమైనప్పటి నుంచి గూగుల్ పేరు బాగా వినిస్తోంది. రాబోయే ముప్పును అరికట్టేందుకు అని చెబుతూ.. దాదాపు 12 వేలకు పైగా ఉద్యోగులను ఫైర్ చేసింది. ఖర్చలను తగ్గించుకునేందుకే ఇలా చేస్తున్నామంటూ ప్రకటించింది. కానీ, మరోవైపు ఏఐ టెక్నాలజీపై మాత్రం కోట్లలో ఖర్చు చేస్తోంది. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ తమ చాట్ జీపీటీని విడుదల చేసిందో.. అప్పటి నుంచి గూగుల్ సంస్థ ఏఐ టెక్నాలజీపై మరింత దృష్టి సారించింది. హడావుడిగా గూగుల్ బార్డ్ ని కూడా విడుదల చేయబోతున్నామంటూ సుందర్ పిచాయ్ ప్రకటన కూడా చేశారు. వెనువెంటనే టెస్టింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఆ టెస్టింగ్ లో దొర్లిన ఒక తప్పు ఇప్పుడు ఆ సస్థకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
గూగుల్ బార్డ్ టెస్టింగ్ వీడియోలో తప్పుగా ఉన్న సమాధానం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అయితే ఇందుకు సుందర్ పిచాయ్ తొందరపాటే కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు. బయట వ్యక్తులే కాదు.. సంస్థ ఉద్యోగులు కూడా సుందర్ పిచాయ్ పై ట్రోలింగ్ చేస్తున్నారట. ఇంటర్నల్ ఫోరమ్ మీమ్ జెన్ లో రష్ట్(తొందరగా), బాచ్డ్(నిర్లక్ష్యంగా), కామిక్లీ షార్ట్-సైటెడ్ (హాస్యాస్పదం) అని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే బార్డ్ ప్రకటన, లేఆఫ్స్ ను మయోపిక్ (అస్పష్టంగా) అంటూ అభివర్ణిస్తూ ట్రోల్ చేస్తున్నారు. గూగుల్ నష్టానికి సుందర్ పిచాయ్ నే బాధ్యుడిని చేస్తూ మాట్లాడుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. గూగుల్ బార్డ్ కు సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఓ ప్రశ్నకు బార్డ్ చెప్పిన ఇంత రచ్చకు దారి తీసింది. “తొమ్మిదేళ్ల పిల్లలకు వివరించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ కొత్తగా కనుగొన్నవి ఏమిటి?” అనే ప్రశ్నకు గూగుల్ బార్డ్ పలు సమాధానాలు చెప్పింది. వాటిలో “భూమికి వెలుపల సోలార్ సిస్టమ్ తొలి చిత్రం తీసిన శాటిలైట్ జేడబ్ల్యూఎస్ టీ” అనే సమాధానం కూడా ఉంది. నిజానికి యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్ట్ టెలీస్కోప్ 2004లో ఆ చిత్రాన్ని తీసింది. అదే విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. అలా టెస్టింగులో బార్డ్ చెప్పిన తప్పు సమాధానం ఇప్పుడు ఆ సంస్థకు తీవ్ర నష్టాన్ని, సుందర్ పిచాయ్ పై ఆరోపణలు వచ్చేలా చేసింది.