ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే తెలియని వాళ్లు ఉండరేమో. పొద్దున లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని సామాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా ఉంటారు. అలా వాళ్లు ఎక్కువగా వాడే యాప్స్ లో ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్ తప్పకుండా ఉంటాయి. చాలామంది రోజూ ఫేస్ బుక్ వాడుతూనే ఉంటారు. అయితే మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే. అవును ఫేస్ బుక్ విషయంలో ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాళ్లు ఏదో సీక్రెట్ టెస్టింగ్ చేస్తున్నారట. ఆ ఆరోపణలు చేసింది ఎవరో దారిన పోయే దానయ్య కాదండోయ్.. అక్కడ పనిచేసిన ఓ మాజీ ఉద్యోగే.
ఫేస్ బుక్ విషయంలో ఇప్పుడు కొన్ని ఆరోపణలు యూజర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫేస్ బుక్ లో పనిచేసి మానేసిన ఓ మాజీ ఉద్యోగి ఆ సంస్థపై కొన్ని ఆరోపణలు చేశాడు. ఆరోపణలతో ఆగిపోకుండా అతను సంస్థపై న్యాయపోరాటానికి దిగాడు. ఫేస్ బుక్ ఓ సీక్రెట్ ప్రయోగం చేస్తోందని చెప్పుకొచ్చాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి హేవార్డ్ ఈ ఆరోపణలు చేశాడు. ఫేస్ బుక్ సంస్థ యూజర్లకు తెలియకుండా వారి ఫోన్లతో ప్రయోగం చేస్తోంది. ఎవరి ఫోన్లలో అయితే ఈ యాప్స్ ఉంటాయో.. ఉద్దేశపూర్వకంగా వారి ఫోన్లలో బ్యాటరీని ఖాళీ చేయచ్చు.
అవును.. ఇలాంటి ఓ ప్రయోగం ఫేస్ బుక్ చేస్తోందట. దీనిని బ్లాక్ టెస్టింగ్ గా పిలుస్తారని హేవార్డ్ చెబుతున్నాడు. సంస్థ కావాలనే యూజర్ల ఫోన్లతో ఈ టెస్టింగ్ చేస్తోందట. ఈ ప్రయోగంలో వారి యాప్స్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్పీడ్ గా పనిచేస్తోందా? స్లోగా ఉందా? ఇమేజెస్ ఎంత ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతున్నాయి? వంటి అంశాలను యూజర్లకు తెలియకుండానే వారి స్మార్ట్ ఫోన్లలో ప్రయోగాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఖాళీ కావడమే కాకుండా.. ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదే విషయంపై హేవార్డ్ న్యాయస్థానంలో లాసూట్ ఫైల్ చేశాడు. ఈ విషయంపై గతంలో తాను మేనేజర్ తో కూడా చర్చించినట్లు చెబుతున్నాడు. “ఈ ప్రయోగం విషయాన్ని మేనేజర్ తో చర్చించాను. దీనివల్ల ఎవరో ఒకరికి ఇబ్బంది కలగచ్చు అన్నాను. అందుకు ఆ మేనేజర్ కొందరు ఇప్పుడు ఇబ్బంది పడినా.. చాలామంది తర్వాత ప్రయోజనం పొందుతారు అని చెప్పింది” అంటూ హేవార్డ్ వ్యాఖ్యానించాడు. ఈ ప్రయోగానికి సంబంధించి ఫేస్ బుక్ ఇంటర్నల్ ట్రైనింగ్ కోసం డాక్యుమెంట్ కూడా రెడీ చేశారంట. దానిని ఉద్యోగులకు ఇచ్చారట. “థాట్ ఫుల్ నెగిటివ్ టెస్టులను రన్ చేయడం ఎలా?” అనే టైటిల్ తో డాక్యుమెంట్స్ పంపిణీ చేశారట. అలాంటి ఒక దారుణమైన డాక్యుమెంట్ ని నేను నా కోరీర్ లోనే చూడలేదు అంటూ హేవార్డ్ చెప్పుకొచ్చాడు.