టీ-20 వరల్డ్ కప్ ఎవ్వరు ఊహించని విధంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన జట్లు అనూహ్య ఓటమి చెందుతుండగా, ఏ మాత్రం అంచనాలు లేని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. టీమిండియా మొదటి మ్యాచ్ లోనే ఓడిపోవడం, ఆ తరువాత న్యూజిలాండ్ ని కూడా పాక్ మట్టి కరిపించడంతో గ్రూప్ 2 లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగబోయే ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకి సెమి ఫైనల్ బెర్త్ దాదాపు మూసుకుపోయినట్టే.
ఇంత కీలకమైన ఈ మ్యాచ్ కి ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లూకీ ఫెర్గ్యూసన్ గాయం కారణంగా మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. కుడి కాలి చీలమండకి తేలికపాటి ఫ్రాక్చర్ ఏర్పడటంతో ఫెర్గ్యూసన్ తప్పుకోక తప్పలేదు. నిజానికి పాకిస్థాన్ తో మ్యాచ్ కి ముందే ఫెర్గ్యూసన్ కి ఈ గాయం అయ్యింది. అయితే.., అతను ఇండియాతో మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ.., గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఫెర్గ్యూసన్ మొత్తం టోర్నీకే దూరం అవ్వాల్సి వచ్చింది. గత వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫెర్గ్యూసన్ భారత టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. గంటకి 150 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరే ఫెర్గ్యూసన్ దూరం కావడం న్యూజిలాండ్ కి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. మరి.. ఈ నేపథ్యంలో కీలకమైన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.