న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కి ఇండియా అన్నీ విధాలా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది కూడా. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఆడడం ఖాయం అయ్యింది. ఇప్పుడు ఈ విషయంలోనే పెద్ద చర్చ నడుస్తోంది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ల మధ్య పోటీ అంటే.. అందరి ఛాయస్ రాహుల్ వైపే ఉంటుంది. అనుభవం రీత్యా కూడా రాహుల్ కే మద్దతు లభిస్తుంది. పైగా.., ఐపీఎల్ 2021 సీజన్ లో రాహుల్ మంచి టచ్ లో కనిపించాడు. సగం పూర్తి అయిన ఆ టోర్నీలో రాహుల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. మరోవైపు గిల్ ఈ టోర్నీలో దారుణంగా ప్లాప్ అయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయిన చాలా మ్యాచ్ లు గిల్ స్లో ఓపెనింగ్ కారణంగా చేజారినవే. ఇలాంటి నేపథ్యంలో శుభమాన్ గిల్ పై కోహ్లీ అంత నమ్మకం ఎందుకు ఉంచాడన్నది ఎవ్వరికీ అర్ధం కాని ప్రశ్నగా మారింది.
టెస్ట్ గణాంకాలు ప్రకారం చూసుకుంటే.., కెరీర్ లో ఇప్పటి వరకు 7 టెస్ట్ లు ఆడిన శుభమాన్ గిల్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతని యావరేజ్ కూడా 35 కన్నా తక్కువే. కానీ.., రాహుల్ కి టెస్ట్ లలో 5 సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోర్ కూడా 199. కాబట్టి గిల్ తో పోల్చుకుంటే రాహుల్ కి భారీ ఇన్నింగ్స్ లు అడగల కెపాసిటీ ఉంది. అయినా.., అదృష్టం మాత్రం గిల్ నే వరించింది. నిజానికి ఆస్ట్రేలియా టూర్ లో కూడా గిల్ ప్రతి ఇన్నింగ్స్ లో స్థిరంగా రాణించింది లేదు. ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే 90 పరుగులు చేశాడు. మిగతా అన్నీ ఇన్నింగ్స్ లలో విఫలం అయ్యాడు. కానీ.., తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో మాత్రం గిల్ హాఫ్ సెంచరీ తో రాణించాడు. ఈ కారణంగానే గిల్ కి తుది జట్టులో స్థానం ఖాయం అయినట్టు తెలుస్తోంది. మరి.. ఫైనల్ లో శుభమాన్ గిల్ భారత్ కి ఎలాంటి శుభారంభాన్ని అందిస్తాడో చూడాలి.