గతంలో ఎందరో ఆటగాళ్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో తమ స్థానం మారిన తర్వాత అద్భుతంగా రాణించిన చరిత్ర ఉంది. అయితే తాజాగా ఓ ఆటగాడు మాత్రం తనకిష్టిమైన స్థానం నుంచి మారగానే అసలు బ్యాటింగే రానట్లు.. అనామక బౌలర్ల చేతిలో ఔటవుతున్నాడు.
కెరీర్ తొలి నాళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. అయితే అతడిలోని దూకుడు గమనించిన సీనియర్లు.. కొత్త బంతిని ఎదుర్కునేలా ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాక సీన్ మారిపోయింది. వన్డేల్లో పర్మనెంట్ ఓపెనర్‌గా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలాడు. అలాంటి టెండూల్కర్.. 2007 వన్డే ప్రపంచకప్ సమయంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయిన విషయం కూడా గమనించాలి. అంటే కొందరు ఆటగాళ్లు కొన్ని స్థానాల్లో మరింత బాగా ఆడగలరని ఈ విషయం స్పష్టం చేసింది. టీమిండియా చరిత్రలో ఇలాంటి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అంతకుముందు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్.. ఓపెనర్ అవతారమెత్తాక వీరలెవల్లో విజృంభిస్తే.. అసలు స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. 8వ స్థానంలో నుంచి టాపార్డర్‌కు వెళ్లి ఇప్పుడు ప్రపంచంలోనే ప్రమాదకర బ్యాటర్‌గా ఎదిగాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. సనత్ జయసూర్య నుంచి.. రోహిత్ శర్మ వరకు ఎందరో ఆటగాళ్లు.. స్థానచలనం అనంతరం సంచలనాలు సృష్టించారు. అయితే దీనికి విరుద్ధమైన సంఘటనలకూ కొదవలేదు. మిడిలార్డర్‌లో ఆడే తెలుగు ఆటగాడు హనుమ విహారిని జట్టు అవసరాల కోసం ఓపెనర్‌గా పంపిన మేనేజ్‌మెంట్ చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత మిడిలార్డర్‌లోనూ నిలకడ కనబర్చలేకపోయిన విహారి అసలు జట్టులో చోటే కోల్పోయాడు. తాజాగా భారత జట్టులో అలాంటి సంఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. అండర్-19 ప్రపంచకప్‌లో దుమ్మురేపి అదే ఊపులో జాతీయ జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చక్కటి ఇన్నింగ్స్‌లతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అదే సమయంలో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడం కూడా గిల్‌కు కలిసొచ్చింది. దీంతో సులువుగానే జట్టులో చోటు సుస్థిరం చేసుకున్న ఈ యువ ఓపెనర్.. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు.
పానిపూరి పోరడు యశస్వి జైస్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి మూడో ప్లేస్‌కు చేరగా.. కరీబియన్లతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సత్తాచాటలేకపోయాడు. తొలి టెస్టులో 6 పరుగులకే వెనుదిరిగిన ఈ పంజాబ్ కా పుత్తర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 రన్స్ కొట్టాడు. సిరీస్ ఆరంభానికి ముందు గిల్‌ను ఓపెనర్‌గానే కొనసాగించి యశస్విని వన్‌డౌన్ లో ఆడిస్తారనుకుంటే.. గతంలో మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం ఉన్న గిల్ తానే స్వయంగా మూడో స్థానంలో దిగేందుకు ముందుకొచ్చాడని రోహిత్ పేర్కొన్నాడు. ఫార్మాట్లకు అతీతంగా మంచి టెక్నిక్, స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్న గిల్.. స్థానచలనంతో సరిగ్గా ఆడకపోవడం ఇప్పుడు మేనేజ్‌మెంట్‌కు కొత్త తలనొప్పిగా మారింది. 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గిల్.. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేయడంతో పాటు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సైతం తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. మరి తన ఓపెనింగ్ స్థానం పోవడంతోనే గిల్ ఫామ్ పోయిందా! ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.