క్రికెట్ రంగంలో ఎంతోమంది తమ పర్సనాలిటీతో అభిమానులను ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో స్టార్ క్రికెటర్ రాకీమ్ కార్న్‌వాల్ ఒకరు. బాహుబలి రేంజ్ లో ఆయన పర్సనాలిటీ ఉంటుందని అంటుంటారు.
ఈ నెల 12 నుంచి టీమ్‌ఇండియాతో జరుగనున్న తొలి టెస్టు కోసం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన టీమ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఆటతోనే కాకుండా తన ఆకారంతో అదరినీ ఆకర్శించిన రాకీమ్ కార్న్‌వాల్.. వెస్టిండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 12 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. తొలి టెస్టు కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శనివారం జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టుకు ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వెస్టిండీస్ ‘బాహుబలి’గా గుర్తింపు తెచ్చుకున్న రాకీమ్ కార్న్‌వాల్ 2021 తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతంలో తన బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో ధాటైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కర్న్‌వాల్‌పై నమ్మకముంచిన సెలెక్టర్లు.. మరో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు కల్పించారు. గతంలో (2019) భారత్‌పైనే టెస్టు అరంగేట్రం చేసి ఆకట్టుకున్న కార్న్‌వాల్ ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.
గతమెంతో ఘనం అన్నట్లు.. అంతర్జాతీయ చరిత్రలో గొప్ప రికార్డు ఉన్న వెస్టిండీస్ జట్టు.. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్ పరిచయమైన కొత్తలో వరుసగా రెండు ప్రపంచకప్ (1975, 1979)లు సొంతం చేసుకున్న కరీబియన్ జట్టు.. 1983లోనూ ఫైనల్ చేరి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఫైనల్ చేరలేకపోయిన విండీస్ 48 ఏళ్ల చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయింది. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో కరీబియన్లు పాల్గొనడం లేదు. జింబాబ్వేలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన విండీస్ నిరాశగా నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్లు విచారం చేయగా.. కరీబియన్ బోర్డు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోంది. తాజా జట్టును పరిశీలిస్తే.. లెఫ్ట్ హ్యాండర్లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు.
ధాటిగా ఆడే సత్తా ఉన్న కిర్న్ మెకంజీ, అలిక్ అథనాజ్‌లకు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. వీరిద్దరూ గతంలో వెస్టిండీస్ తరఫున వన్డే క్రికెట్ ఆడారు. బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్న జట్టులో మాజీ స్టార్ శివ్‌నరైన్ చందర్‌పాల్ కుమారుడు టగ్‌నరైన్ చందర్‌పాల్ చోటు దక్కించుకోగా.. బ్రాక్‌వుడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ జాసెన్ హోల్డర్‌తో పాటు కిమార్ రోచ్, అల్జారీ జోసెఫ్ జట్టులో చోటు నిలపుకున్నారు. 13 మంది సభ్యుల జట్టుతో పాటు ఇద్దరు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లను సైతం విండీస్ బోర్డు ప్రకటించింది.