పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోలేక విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లకుండా ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కోహ్లీ పేలవ ప్రదర్శన విమర్శలకు దారిచూపడమే కాకుండా, ఐసీసీ ర్యాంకులను సైతం దిగజారుస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్ పర్యటనలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన కోహ్లీ.. టెస్టుల్లో టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు కోల్పోయాడు. అలాగే టీ20ల్లో సైతం విఫలమవడంతో.. టీ20 టాప్ టెన్ జాబితా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతనికి అచ్చొచ్చిన వన్డేల్లో కూడా కోహ్లీ ర్యాంకు కిందకు దిగజారింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రేటింగ్ పాయింట్లు 774కు పడిపోయాయి. దీంతో అతను ఐదో స్థానానికి చేరాడు. గడిచిన ఏడేళ్లలో ఇదే కోహ్లీ వరస్ట్ ర్యాంక్. అక్టోబర్ 2015 తర్వాత టాప్ 4 వన్డే బ్యాటర్ల జాబితాలో కోహ్లీ స్థానం కోల్పోవడం ఇదే మొదటిసారి.
అయితే.. పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ మాత్రం తన ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాడు. వన్డేలు, టీ20ల్లో టాప్ బ్యాటర్‌గా ఉన్న బాబర్.. టెస్టుల్లో కూడా తన స్థానం మెరుగు పరుచుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో అద్భుత సెంచరీతో మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న బ్యాటర్‌గా అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ఐసీసీ టెస్టు బ్యాటర్ ర్యాంకింగ్స్ లో.. జో రూట్ మొదటి స్థానంలో ఉండగా, రిషబ్ పంత్ 5 , రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నరు. ఇక వన్డేల విషయానికొస్తే.. బాబర్ ఆజమ్ టాప్ మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా.. 5,6 స్థానాల్లో ఉన్నారు. ఇక టీ20ల్లో బాబర్ ఆజమ్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా, సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ర్యాంక్ అంతకంతకూ దిగజారుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: నా ‘లక్ష్యమదే’.. మనసులో మాట బయటపెట్టిన విరాట్ కోహ్లీ!
ఇదీ చదవండి: IND vs WI: మ్యాచ్ చివర్లో అంతా బయటికొచ్చేశారు! కోపంగా అరిచిన ద్రవిడ్