మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా నేడు(బుధవారం) రెండో వన్డే ఆడనుంది. గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి పొందిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా.. బౌలింగ్‌లో రాణించినా.. బంగ్లాదేశ్ విరోచితంగా పోరాడి చివరి వికెట్‌కు 51 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో పటిష్టమైన టీమిండియా ఓటమి పొందడంతో.. రోహిత్ సేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఎలాగైన రెండో వన్డేలో గెలిచి.. పరువుతో పాటు సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన దృఢ నిశ్చయంతో ఉంది.
ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లీ.. తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కోహ్లీ, రెండో వన్డేలో మాత్రం సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 అద్భుత ఫామ్‌తో దుమ్ములేపిన కోహ్లీ, వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకుని.. బంగ్లాదేశ్ సిరీస్‌కు సిద్ధమయ్యాడు. బంగ్లాతో తొలి మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుటైన కోహ్లీ.. రెండో వన్డేలో బ్యాట్ ఝుళిపించాలని కసితో ఉన్నాడు. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం మొదలైతే.. ఆ ప్రవాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఢాకాలో షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 21 పరుగులు చేస్తే.. రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకోనున్నాడు.
బంగ్లాదేశ్‌పై ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 979 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు బాదితే.. బంగ్లాదేశ్‌పై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కుతాడు. అంతకుముందు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగార్కర బంగ్లాదేశ్‌పై 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక విదేశీ జట్లపై వారి సొంత గడ్డపై 1000 పరుగులు చేసుకున్న ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సాధిస్తాడు. ఏకంగా మూడు దేశాలపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా కోహ్లీ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు శ్రీలంక మాజీ దిగ్గజాలు డిసిల్వా, అర్జున రణతుంగా సరసన చేరుతాడు. బంగ్లాదేశ్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డలపై కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇక అత్యధిక దేశాల్లో 1000 రన్స్ చేసిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా ఐదు దేశాల్లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు.
Hello from Dhaka 👋🏻#TeamIndia all geared up for the 2️⃣nd #BANvIND ODI 👌🏻 pic.twitter.com/NEZ7Y8AMhf
— BCCI (@BCCI) December 7, 2022