మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన ఒకే ఒక్క పవర్ ఫుల్ డైలాగ్.. కలలు కనండి.. వాటి సాకారం కోసం కృషి చేయండి. వినడానికి బాగానే ఉంటుంది.. కానీ ఆచరణలో పెట్టడం అందరికి సాధ్యం కాదు. అందుకు ధృడ సంకల్పం ఉండాలి.. మొక్కవోని దీక్ష ఉండాలి. కల సాకారం కోసం ఎంత కష్టాన్ని అయినా భరించే శక్తి ఉండాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. జీవితంలో విజయతీరాలను చేరుకున్న వారిలో నూటికి 99 మంది.. ఇలా కష్టపడి శ్రమించి.. తమ కలలను సాకారం చేసుకున్న వాళ్లే. తాజాగా ఆ విజేతల సరసన చేరింది మరో యువతి. నేటికి కూడా ఆడపిల్లలను ఆటల దిశగా ప్రోత్సాహించని తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అందునా క్రికెట్ లాంటి క్రీడలవైపైతే అస్సలు ప్రోత్సాహించరు. ఎన్నో అనుమానాలు, భయాల నడుమ.. పిల్లల ఇష్టాలను ఆదిలోనే తుంచేసే తల్లిదండ్రులు కోకొల్లలు.
కానీ అలా కాకుండా.. పిల్లల మనసుకు నచ్చిన రంగంలో వారిని ప్రోత్రాహిస్తే.. ఆ ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో కనీసం ఊహించలేరు. తాజాగా ఈ మాటలను నిజం చేసి చూపింది ఓ యువతి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రికెట్‌లో రాణిస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు.. ఏకంగా భారత జట్టుకు సెలక్టయ్యింది. కుమార్తె సాధించిన విజయం చూసి ఆ తల్లిదండ్రులు గర్వంతో పొంగి పోతున్నారు. మరి భద్రాద్రి నుంచి భారత జట్టుకు సెలక్ట్ అవ్వడం వరకు ఆ యువతి విజయ ప్రస్థానం సాగిందిలా..
తెలంగాణ, భద్రాద్రికి చెందిన 17 ఏళ్ల గొంగడి త్రిష.. తాజాగా భారత అండర్-19 క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన రావడంతో.. జిల్లా వాసులు త్రిషను ప్రత్యేకంగా అభినందించారు. త్రిష తండ్రి వెంటక్రామిరెడ్డి కాగా.. తల్లి మాధవి. ఇక వెంకట్రామిరెడ్డి.. భద్రాచలం మార్కెట్ రోడ్‌లో వ్యాయమశాల నిర్వహించేవాడు. అదే కాక ఐటీసీ పీఎస్‌పీడీలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా పని చేసేవాడు. త్రిష ఐదవ తరగతి వరకు.. స్థానిక సెయింట్ పాల్స్ స్కూల్లోనే చదువుకుంది. క్రీడాలపై అవగాహన ఉన్న వెంకట్రామిరెడ్డి.. కుమార్తె ఆసక్తి మేరకు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించేవాడు. అంతేకాక స్థానిక క్రికెట్ కోచ్‌ల సాయంతో.. ఐదేళ్ల వయసు నుంచే త్రిషకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు. కొద్ది కాలంలోనే త్రిష గేమ్‌లో మంచి పట్టు సాధించింది.
కుమార్తె త్రిషకు క్రికెట్ పట్ల ఆసక్తి గమనించిన వెంకట్రామిరెడ్డి.. కూతురు భవిష్యత్తు కోసం ఉన్న ఊరిని విడిచి.. 2012లో హైదరాబాద్ వచ్చారు. పట్నం వచ్చాక త్రిషకు మంచి కోచింగ్.. ట్రైనింగ్ ఇప్పించడం ప్రారంభించాడు. నిత్య సాధనతో.. ఆటలో మెరుగ్గా రాణించడం ప్రారంభించింది త్రిష. ఓవైపు చదువుకుంటూనే.. మరో వైపు గంటల తరబడి మైదానంలో క్రికెట్ సాధన చేస్తూ.. రాణించసాగింది త్రిష.
ఈ క్రమంలో బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున ఆడిన త్రిష.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. అదే విధంగా జైపూర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ-2021లోను ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది త్రిష. ఈ నేపథ్యంలో త్వరలోనే స్వదేశంలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు త్రిష సెలక్టయ్యింది. 15 మంది సభ్యులను ఎంపిక చేసిన ఈ జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికయ్యింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు.. కివీస్‌తో 5 టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్ని ముంబై వేదికగా జరగనున్నాయి. ఇక త్రిష భారత జట్టుకు సెలక్టవ్వడంపై ప్రశంసలు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు.