వరల్డ్ కప్ ముందు నుంచే టీమిండియా జోరుమీదుంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్ లు నెగ్గి ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది. దానికి తగ్గట్లుగానే తొలి మ్యాచ్ లో పాక్ పై అద్భుతమైన విజయం సాధించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాక్ మాజీలు అయితే భారత ప్లేయర్స్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఆటకు వారు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. ఇక టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత్ కు కాబోయే కెప్టెన్ అంటూ.. పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పాండ్యాపై పొగడ్తల వర్షం కురిపించాడు.
హార్దిక్ పాండ్యా.. టీమిండియాలోకి వచ్చిన అనతి కాలంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. క్రమంగా మ్యాచ్ ఫినిషర్ గా కూడా తన పనిని మెుదలు పెట్టి.. టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. తాజాగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 40 పరుగులు చేసి.. కోహ్లీతో విలువైన శతక భాగాస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో భారత్ చిరస్మరణియమైన విజయం సాధించింది. ఈ క్రమంలోనే పాండ్యాను పాక్ మాజీ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఓ కార్యక్రమంలో అతడు మాట్లాడుతూ..”టీమిండియాలో రోహిత్ లాగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల లక్షణాలు పాండ్యాలో ఉన్నాయి. ఐపీఎల్ లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ జట్టు పగ్గాలు చేపట్టి, టైటిల్ అందించడం మామూలు విషయం కాదు. రోహిత్ శర్మ వారసుడిగా పాండ్యా ఎదుగుతాడనడంలో సందేహం లేదు. నా దృష్టిలో టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ పాండ్యానే” అంటూ కితాబిచ్చాడు వకార్ యూనిస్.
ఈ మ్యాచ్ లో పాండ్యా.. కోహ్లీతో కలిసి అభేద్యమైన 113 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ మ్యాచ్ లో పాండ్యా తన ఆటకు విరుద్దంగా స్ట్రైక్ రొటేట్ చేస్తు.. కోహ్లీకి సహకారం అందించాడు. ఇది ఎంతో పరిణితి చెందిన ఆట అని యూనిస్ అన్నాడు. మరో పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ పాండ్యాపై స్పందిస్తూ..”పాండ్యా జట్టులో కీలక ఆటగాడు మాత్రమే కాదు.. సారథిగా జట్టుకు అవసరమైన సందర్భాల్లో సలహాలు కూడా ఇవ్వగలడు. ఐపీఎల్ ల్లోనే అది నిరూపించాడు. టీమిండియా గెలుపోటములపై పాండ్యా కచ్చితంగా ప్రభావం చూపుతాడు” అని అక్రమ్ అన్నాడు. ఇక పాక్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ లో 40 పరుగులు చేయడంతో పాటుగా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.